Home » D Kameshwari » D Kameswari Kathalu
'నీ అంత మొండిదాన్ని చూడలేదు తల్లీ - అసలు మీ అమ్మ, నాన్నలని అనాలి, అలా నీ ఇష్టానికి నిన్ను వదిలేసి నిమ్మకు నీరెత్తినట్టు వూరుకున్నందుకు...' ఆవిడ కోపం కొడుకు మీదకి తిరిగింది.
"ఏం చెయ్యమంటావమ్మా, చిన్నపిల్లలా కేకలేసి చెప్పి వప్పించడానికి - చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నవాళ్లు, వాళ్లకి మనం ఏం చెప్పాలి-' కాస్త బాధ, నిర్లిప్తత కలిపి అన్నారు రంగారావు. పవిత్ర ఇంటికొచ్చేశాక, రాజ్యలక్ష్మి, 'ఏమిటిరా నాయనా, ఎవరి పాటికి వాళ్లు అలా ఏం పట్టనట్లూరుకున్నారు నిశ్చింతగా-" అన్న తల్లి మాటలకి కొడుకు జవాబిది.
"ఇంట్లో ఇంతమంది పెద్దవాళ్లం వుండి చక్కదిద్దే ప్రయత్నం చెయ్యొద్దా - దాని కూర్చోపెట్టి కాస్త నయానో, భయానో నచ్చచెప్పాలి-' రాజ్యలక్ష్మి ఆరాటంగా అంది.
"ఆ - నచ్చచెప్పడాలు. ఈ కాలం పిల్లలకు ప్రతిదానికి వాళ్ల దగ్గిర జవాబు రెడీగా వుంటుంది... అడిగాంగా - ఏమంది.. ఇద్దరికీ కలవలేదు... ఫ్రెండ్లీగా విడిపోదామని నిర్ణయించుకున్నాం అని ఓ ముక్కలో తేల్చేసింది మొదటి రోజే!"
"ఏమిటో ప్రేమ అన్నారు, మనసులు కలిశాయన్నారు, మనకి వాళ్లకి కుదరదు, నీకు అక్కడ ఇమడలేవు అని చిలక్కి చెప్పినట్లు చెప్పాంగదా - విందా - మనవాళ్లూరికే అన్నారా కులం, గోత్రం, కుటుంబం అన్నీ చూసుకోవాలని... ఎవరి ఆచార వ్యవహారాలూ ఎవరు మానుకుంటారు ఇంకోరి కోసం..." రాజ్యలక్ష్మి సణిగింది.
"ఏం చేస్తాం అమ్మా, పెద్దవాళ్లు ఎందుకు చెప్పారన్నది అర్థం చేసుకోవడం లేదు ఈ తరం. మంచి తోవ చూపిస్తా అన్నా వెళ్లి వెళ్లి బురదలో దిగబడేవారిని ఏం చెయ్యగలం - అంటిన బురద కడుక్కోవలసింది వాళ్లేనని వాళ్లంతట వాళ్లు గ్రహించాల్సిందే."
'బానే వుంది - ఆ బురద వాళ్లతోటే పోదుగా, మన ఇంటికి వచ్చి అంటిస్తున్నారుగా. ఏం చేస్తాం, కన్న పాపానికి మనకూ తప్పదు ఇంటికి అంటినది కడుక్కోడానికి.'
ఈ సంభాషణ పవిత్ర కాపురం వదిలి ఇంటికొచ్చిన కొత్తలో జరిగింది - అంటే ఏడాదిన్నర గడిచిపోయింది - పరిచయం, స్నేహం, ప్రేమ ఒక ఏడాది - పెళ్లి, కాపురం రెండున్నర ఏళ్లు - మొత్తం మూడేళ్లలో అంతా ముగిసి గోడకి కొట్టిన బంతిలా వెనక్కి వచ్చింది - తేడా అల్లా ఒకర్తే వెళ్లి ఇద్దరయి పిల్లాడితో వచ్చింది - "కనీసం పిల్లాడి కోసమన్నా సర్దుకోవచ్చు... వాడికి తండ్రిని దూరం చేస్తావా-" అంటూ కళ్యాణి కూడా మందలించింది - 'మరేం పరవాలేదు - వంటరిగానే చూసుకోగలను, తండ్రిని దూరం చెయ్యనులే, వారానికోసారి వచ్చిపోతుంటాడుగా.. పిల్లాడి బాధ్యత ఇద్దరిదీ అని అనుకున్నాంలే-' తేలిగ్గా కొట్టిపారేసింది.
'పిల్లలు లేకపోతే ఓ రకం, పిల్లాడుండగా నీకు మళ్లీ పెళ్లి కష్టం అవుతుందన్నది ఆలోచించావా-' కళ్యాణి నిలేసింది.
'అబ్బ, పెళ్లి కోసం ఎవడేడిచాడు - ఇంకో పెళ్లి చేసుకోవాలని నేననుకోవడంలేదు - విసుగ్గా అంది-' ఒకవేళ నాకెప్పుడన్నా చేసుకోవాలనించినా పిల్లాడు అడ్డు అనుకునేవాడ్ని చేసుకోను-' నమ్మకంగా అంది.
'పవిత్రా... మరోసారి బాగా ఆలోచించు - అన్నీ తెలిసి, అంగీకరించి అతన్ని చేసుకుని ఇప్పుడక్కడ ఇమడలేను అనడం బాగులేదు - విశ్వాస్ మంచివాడు అతన్ని వదులుకోవడం ఫూలిష్ నెస్-' రంగారావు కూతురికి నచ్చచెప్పే ప్రయత్నంలో అన్నారు.
"డాడీ, ప్రయత్నించాను గదా - రెండున్నర ఏళ్లు అనేక రకాలుగా ఎడ్జస్ట్ అవ్వాలనే ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో మనశ్శాంతి పోగొట్టుకున్నాను. నేనెవరినీ బ్లేమ్ చేయడంలేదు. మనకు అలవాటులేని పరిసరాలలో సర్దుకోవడం పెద్ద విషయం కాదు. విశ్వాస్ కోసం సర్దుకుపోవచ్చు అనుకున్నాను గాని, అనుభవంలోకి వచ్చాక గాని ఆ సర్దుబాటు అన్నది అంత సుళువు కాదని తెలిసింది - మనశ్శాంతి లేకుండా, సిల్లీ విషయాలకి ప్రాముఖ్యం ఇస్తూ-వీటన్నింటి మధ్య నా ఉద్యోగం, కెరీర్ దెబ్బతినడం ప్రారంభించాక సర్దుబాటు అసంభవం అనిపించింది -" తండ్రికి తన మనోభావం విడమర్చి చెప్పింది.
"అందుకే కులం, ఆచార వ్యవహారాలూ అన్నీ చూసుకోవాలని పెద్దలు అనుభవంతో చెప్పిన మాట, మీ పిల్లలకి అనుభవంలోకి వచ్చాక గాని అర్థంగావు. రాజ్యలక్ష్మి అంటించింది.
పవిత్ర విశ్వాస్ ని చేసుకుంటానన్నప్పుడు - అతను మార్వాడి - జాయింట్ ఫ్యామిలీ - బిజినెస్ లో తండ్రి ఇద్దరన్నదమ్ములు పార్టనర్స్ - తల్లి తండ్రి అన్నా వదిన అంతా కల్సి వుండే ఫ్యామిలీ - వాళ్ల ఆచార వ్యవహారాలు వేరు. కోడలంటే ఒద్దికగా, అణుకువగా ఇల్లు వాకిలి చూసుకోవాలనే సాంప్రదాయం వారిది, ఇంట్లో అత్తగారునన్ని రోజులు పెత్తనం ఆవిడది - అజమాయిషీ, అధికారం అంటా ఆవిడది - కోడళ్లు అత్తచాటునే వుండాలనే నియమాలుంటాయి - నీవేమో కేర్ ఫ్రీగా పెరిగిన దానివి, జాయింట్ ఫ్యామిలీలో వుండగలవా. డబ్బు, హోదా అన్నీ వున్నాయనుకో, వాళ్లలో ఉద్యోగాలు చేసే కోడళ్లు తక్కువ - అంగీకరించానా - అసలు అందరిలో కలిసి వుండగలననుకుంటున్నావా. ఆలోచించావా ఈ విషయాలు' కళ్యాణి హెచ్చరించింది.
"విశ్వాస్ వాళ్లకి అన్నీ చెప్పాడమ్మా - నేనూ వాళ్లింటి కెళ్లినప్పుడు ఇంత చదివి ఉద్యోగం లేకుండా వుండనని ఖచ్చితంగానే చెప్పాను - జాయింట్ ఫ్యామిలీ అనుకో, కాని మనుష్యులు మంచివాళ్లలాగే కనిపించారు. అన్నింటికీ పనివాళ్లున్నారు. నేను పొద్దుట వెళ్లి రాత్రి వస్తాను. ఇంక పెద్ద గొడవలు వచ్చేందుకు ఆస్కారం ఏముంటుంది. ఏ ప్రాబ్లమ్ వచ్చినా విశ్వాస్ చూసుకుంటానన్నాడు. విశ్వాస్ కోసం ఆ మాత్రం సర్దుకుపోగలననుకుంటున్నాను' పవిత్ర నమ్మకంగా అంది.
ఇంక చెప్పడానికేం వుంది - వద్దనడానికి తెలుగువాళ్లు కాదన్నదొక్కటే అభ్యంతరకరం - ఎంబిఏ చేశాడు - ఫార్మాసూటికల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు - తండ్రి చైర్మన్ - పెద్ద కొడుకు మేనేజింగ్ డైరెక్టరు. పెద్ద ఇల్లు, కార్లు, హోదా వున్న కుటుంబం.
అంగరంగ వైభవంగా తమ తాహతుని మించి వారి తాహతుకి సరిపోయినట్లు పెళ్లి చేశారు రంగారావు, ఇటు అటు ఆచారాలు పద్ధతులు పాటించి - పెళ్లి అయిన మొదటి రాత్రి పవిత్ర నడుం పట్టేసినట్టు నటిస్తూ 'మీ అందరికి వెన్నెముకలు మెత్తగా వుంటాయా-?' అమాయకంగా అడిగింది నవ్వుతూ - విశ్వాస్ కి అర్థంకాక తెల్లపోతూ చూశాడు.' లేకపోతే ఏమిటి బాబూ, రోజులో అన్నిసార్లు అలా సుళువుగా వంగి పాదాభివందనాలు చేసేస్తారు. మనిషి కనిపిస్తే చాలు, ఎవరన్నా ఇంటికొస్తే, లేస్తే దండం, పడుకునే ముందు దండం, బయటికి వెడితే దండం, పండగొస్తే, పూజొస్తే, పెళ్లయితే సరే అలా టక్కున వంగి పాదాభివందనాలు అలా సుళువుగా చేసేస్తుంటే సందేహం వచ్చింది - నాకు ఒక్క రోజుకే నడుం పట్టేసింది మీ వాళ్లలా దండాలు పెట్టేసరికి - బుంగమూతి పెట్టి అంది. విశ్వాస్ పకపక నవ్వాడు - 'చంపావు, ఇదా, ఇంకా ఏదో అనుకుని గాభరాపడ్డాను. అది మా ఆచారం, సంస్కృతి, పెద్దల పట్ల భక్తి, గౌరవం చూపడం మంచిదే కదా-'





