Home » D Kameshwari » D Kameswari Kathalu
'ఏం ఆచారమో, రోజూ ఇలా దండాలు పెట్టాలంటే ఎలా - నాకసలు అలవాటే లేదు-'
'సర్లే, అదో పెద్ద ఇష్యూలా ఇప్పుడు మాట్లాడాల్సిన విషయమా!' తేలిగ్గా కొట్టిపారేశాడు విశ్వాస్.
ఆ చిన్న చిన్న ఇష్యూలే కొద్దిరోజులలో పెద్దదయి మనశ్శాంతి హరించి, దూరాలు సృష్టిస్తుందని ఇద్దరూ ఆనాడు అనుకోలేదు.
* * * * *
'పవిత్రా... సాయంత్ర ఫ్రీయేనా - ఎటైనా వెడదామా, నీతో కాస్త మాట్లాడాలి - బాబుని తీసుకుని లుంబినీ పార్కుకి రాగలవా, అదివారమేగా-' ఓ రెండు నెలల తరువాత విశ్వాస్ ఫోను చేశాడు. "బయటికా, నీవే ఇంటికి రాకూడదూ-' బద్దకంగా అంది పవిత్ర.
'లేదు, ఇంట్లో ఫ్రీగా మాట్లాడుకోలేం - ప్లీజ్ సాయంత్రం రా... పార్కులో కూర్చుని అలా ఎటైనా వెళ్లి డిన్నర్ చేసి వద్దాం, శ్రవణ్ ని తీసుకురా-"
పార్క్ లో శ్రవణ్ ని కాసేపు ముద్దుచేసి ఆడుకోడానికి వదిలి - 'పవిత్రా నాకు ఓ మంచి జాబ్ ఆఫర్ వచ్చింది. తీసుకుందామనుకుంటున్నాను-' ఉపోద్ఘాతంగా అన్నాడు విశ్వాస్.
'జాబ్ ఆఫరా, ఏం, వేరేచోట జాబ్ అవసరం ఏమొచ్చింది - ఎనీ ప్రాబ్లమ్-' ఆశ్చర్యంగా అంది.
"వేరేచోట జాబ్ తీసుకుంటే, వేరే ఇల్లు తీసుకువుందామని...'
ఈసారి ఇంకా తెల్లబోతూ - 'వేరే వుంటావా. ఎందుకు, ఏమయింది. ఎందుకిలాంటి డెసిషన్ తీసుకున్నావు?
'నీ కోసం.. మన కోసం...' అన్నాడు. పవిత్ర మొఖం ఒక్క క్షణం ఎర్రబడి - 'హు నాకోసం ఈ నిర్ణయం అప్పుడు తీసుకుని వుంటే ఈ గొడవలే వుండేవిగావు - ఇప్పుడు తీసుకోవడం అర్థం ఏమిటి?' నిష్ఠూరంగా అంది- 'టూ లేట్ విశ్వాస్' అంది.
'ప్లీజ్ పవిత్రా - అలా అనకు - బెటర్ లేట్ దెన్ నెవ్వర్' అన్నది నాకర్థం అయింది. నీకు దూరం అయ్యి నేను సంతోషంగా లేను. ముఖ్యంగా శ్రవణ్ ని ఎంత మిస్సవుతున్నానో నీకు తెలియదు ఈ ఏడాది నించి - మళ్లీ మనం కలిసి వుందాం పవిత్రా - నీకంటే మంచి భార్య నాకు దొరకదు - నిన్ను పోగొట్టుకున్నాకే ఈ నిజం అర్థం అయింది. మన మధ్య స్నేహం, ప్రేమ ఇంకా మిగిలే వున్నాయని నా అభిప్రాయం - మన మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి గాని స్పర్థలు, కక్షలు లేవు - ఇంకో ప్రయత్నం చేద్దాం పవిత్రా... ఈ ఏడాదిలో ఇద్దరికిద్దరం విడిగా వున్నాం కనుక ఈసారి ఆ పొరపాట్లు దొర్లకుండా సర్దుకుపోయేందుకు ప్రయత్నిద్దాం-' సిన్సియర్ గా అన్నాడు. పవిత్ర తల దించుకుని ఒక్కక్షణం ఆలోచనలో పడింది -
"మరి, మీ వాళ్లు దీనికి ఒప్పుకున్నారా?.. చెప్పావా? ఏం అన్నారు?"
'ఒప్పుకోరు, ఏ పేరెంట్స్ ఒప్పుకోరు. అందులో మా బిజినెస్ కమ్యూనిటీలో కొడుకు వేరే వెళ్లడం అంటే అవమానంగా భావిస్తారు - అందుకేగా, పవిత్రా అప్పుడు అంత తెగించలేకపోయాను - ఆ కంపెనీలో పనిచేస్తూ, ఆ డబ్బు తింటూ పెళ్లవగానే వేరింటి కాపురం పెడితే బాధపడ్తారని, నీవక్కడ అడ్చెస్ట్ కాలేకపోతున్నావని తెల్సి ఇద్దరి మధ్య నలిగిపోయాను, సతమతమయ్యాను.
'మరిప్పుడు మాత్రం-' అనుమానంగా చూసింది.
'ఇప్పుడంటే బయట ఉద్యోగం చేసుకుంటే అంత గిల్టీగా ఫీలవక్కరలేదు' - నాన్నగారితో చెపితే ఆయన చాలా ఫీలయ్యారు - అమ్మయితే ఒకటే గోల, మనవాళ్ల అమ్మాయిని ఉద్యోగం చెయ్యని అమ్మాయిని చేసుకో అంటూ పోరు - నాన్నగారిని కన్విన్స్ చేయగలిగాను- ఆయన వేరే వెళ్లేందుకు ఒప్పుకున్నారు గాని, బిజినెస్ లోంచి వేరయి ఇంకో ఉద్యోగానికి ఒప్పుకోవడం లేదు - బిజినెస్ లో నీ షేర్ నీకుంటుంది - ఉద్యోగం ఇంకోచోట వద్దు నీకా అమ్మాయి ఇంకా కావాలనిపిస్తే అలాగే వేరే ఇల్లు తీసుకో - కానీ అన్నీ జాగ్రత్తగా ఆలోచించు -' అన్నారు... 'అమ్మా నాలుగురోజులు బాధపడ్తుంది - ఆవిడ అర్థం చేసుకుంటుంది. అలవాటవుతుంది-"
'నా కోసం మీ వాళ్లకి దూరమవడం, నేను గిల్టీగా ఫీలవుతాను-'
'అదే పవిత్రా నీలో నాకు నచ్చిన విషయం. నీవు నీకు నచ్చనిది జరిగినా ఇతరుల మీద నెపం నెట్టకుండా నేనే అడ్జస్ట్ అవలేకపోతున్నాను అనగలిగే గొప్ప గుణం వుంది. అదే ఇంకో అమ్మాయి అయితే మా అమ్మ, వదినల మీద ఎన్ని నేరాలు చెప్పేవారో - వాళ్లు నిన్ను అన్న మాటలకి ఎంతో హర్ట్ అయినా తప్పు నాదే ఈ అలవాట్లు, పద్ధతులలో ఇమడలేకపోతున్నాను - మనం వేరే వెడితే గొడవలుండవు అని ఎంతో చెప్పావు - కాని నా రక్తంలో వున్న గుణం మార్చుకోలేక తల్లితండ్రుల మీద ఆధారపడుతూ వారిని కాదని బయటికి వెళ్లే సాహసం ఆనాడు చెయ్యలేక నిన్ను సపోర్టు చేయలేకపోయాను - కాని ఇప్పుడు నేనింక ఏ అమ్మాయినీ నీ స్థానంలో ఊహించలేను - నీవు దూరమయ్యాక గాని నీ విలువ అర్థం కాలేదు - అందుకే తెగించాను - నీవు బయటి ఇద్యోగం చెయ్యమంటే చేస్తాను, లేదంటే మా కంపెనీలోనే వుంటాను నాన్నగారి కోరిక ప్రకారం - పవిత్రా, నా అభ్యర్థనని కాదనకు, కనీసం శ్రవణ్ కోసమన్నా-' పవిత్ర చేయి చేతిలోకి తీసుకుని అభ్యర్ధన పూర్వకంగా అన్నాడు - 'పవిత్ర ఐ లవ్ యూ-' నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానన్నది ఇప్పుడే నాకర్థం అయింది - పవిత్ర కళ్లలో తడి - విశ్వాస్ చేతిమీద చేయి ఆనించి 'నిజం చెప్పనా - అసలు మనం విడిపోయాం అన్నది ఇప్పటికీ మైండ్ లో రిజిష్టర్ అవలేదు తెలుసా - రాత్రి పడుకుంటే అసలు మనం ఎందుకు విడిపోయాం అని ఆలోచించేదాన్ని - 'ఇగో'ల క్లాష్ తప్ప ఇంకేం లేదనిపించేది - మొన్న మా మామ్మ ఒక మాట అంది, అది నన్ను చాలా ఆలోచింప చేసింది విశ్వాస్. 'పెళ్లి అనే పటాన్ని ఫ్రేములో బిగించి అద్దం కట్టిస్తేనే నాలుగు కాలాలు నిలుస్తుందే తల్లీ - ఫ్రేము, అద్దం లేకపోతే దుమ్ము ధూళి పడి బొమ్మ వెలిసి వంకరపోతుంది - భార్యాభర్తలిద్దరూ ఒక ;ఫ్రేము'లో వదిగి, ఇద్దరి 'ఇగో'లు అద్దం కింద దాచేస్తేనే ఫోటోలా కాపురం నిలుస్తుంది' అని ఎంత బాగా చెప్పిందో - ఆరోజు నించి నేనూ నీ గురించి ఆలోచిస్తున్నా -
'షి ఈజ్ ఎ గ్రేట్ లేడి, పెద్దవాళ్లు అనుభవం మీద చెప్పే పాఠాలు మన తరం వింటే సగం సమస్యలు రావు. ఆవిడకున్న జ్ఞానం ముందు మనమెంత' - అభిమానంగా అన్నాడు.
'నీవంటే మామ్మకెంత అభిమానమో - ఇలాంటి వాడెక్కడ దొరుకుతాడే నీకు అంటుంది.'
'ఐతే ముందు ఈ గుడ్ న్యూస్ ఆవిడకే చెప్పాలి' - విశ్వాస్ ఆనందంగా అన్నాడు.
* * * * *
'మామ్మా, నేను మళ్లీ పెళ్లి చేసుకుంటున్నాను -' పవిత్ర లోపలి కెడుతూనే హాల్లో కూర్చున్న మామ్మని కౌగలించుకుని సంతోషంగా అంది. విశ్వాస్ గుమ్మం దగ్గిరే ఆగిపోయాడు - రాజ్యలక్ష్మి మొహం ముందు తెల్లబడి, తరువాత నల్లబడి ఆందోళనగా
'పెళ్లా - ఎవరూ - ఎవరిని... ఇంత హఠాత్తుగా ఎవరే తల్లీ నీకు దొరికిన ఆ మహానుభావుడు-' కాస్త అయిష్టత, విరక్తి కలిపి తనకిష్టం లేదన్న భావనని వ్యక్తం చేసింది.
'ఎంతో మంచివాడని నీవు సర్టిఫై చేసిన వాడేలే-' నవ్వుతూ కన్ను గీటింది. ఆవిడ తెల్లబోయి చూస్తుండగా విశ్వాస్ లోపలికొచ్చి ఆవిడకి పాదాభివందనం చేసి
'ఆ అదృష్టవంతుడిని నేనే దాదీజీ. మొదటిసారి తెలివి తక్కువగా జార్చుకున్న అదృష్టాన్ని మళ్లీ దక్కించుకున్నాను-' ఆవిడ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయింది.
'ఇదిగో ఈ పాదాభివందనాలు చేసి చేసే మా మామ్మ దృష్టిలో మంచివాడయిపోయావు. ఆపింక నీ నాటకాలు-' కసిరింది విశ్వాస్ ని - 'నోరు ముయ్యి - ఆ అబ్బాయిలో వున్న మంచిని ఇప్పుడైనా కళ్లిప్పుకుని సరిగా చూసి అర్థం చేసుకో - నీ ఇల్లు బంగారం కానూ ఒక్క నిమిషం హడలగొట్టేవు - మళ్లీ ఎవడ్ని ప్రేమించిందో మహాతల్లని గాభరాపడ్డాను-"
'అదే మామ్మా, ముఫ్పై ఏళ్ళొచ్చాయి, మళ్లీ ఓనమాలు మొదలు పెట్టినట్టు ఇంకోడ్ని వెతుక్కుని, ప్రేమలు, దోమలు అంటూ షికార్లు తిరగడానికి ఓపిక లేకే ఏదో రాయి పళ్లూడగొట్టుకోడానికి - 'నోన్ డెవిల్ యీజ్ బెటర్' అనుకుని సరిపెట్టేసుకున్నాను, విశ్వాస్ అడగ్గానే చిలిపిగా నవ్వి అంది పవిత్ర -
'చూశారా దాదీజీ, నాకూ ఇంకో అమ్మాయిని వెతికే ఓపిక లేకే పవిత్రని అడిగితే ఫోజులు కొడుతోంది'- రాజ్యలక్ష్మి మనసారా నవ్వి, ఇద్దరి తలలు దగ్గిరికి తీసుకుని 'ఇలాగే పదికాలాల పాటు నవ్వుతూ వుండాలి' అంది ఆనందంగా.
(పత్రిక - నవంబరు 2005)
* * * * *





