Home » yerramsetti sai » Kanthi Kiranalu
"అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదులెండి మరి ఇవాళే వెళ్ళిపోతున్నారా?"
"అవును! రెండుగంటలకు బస్సుందట. సురేంద్ర రిజర్వేషన్ చేయడానికి బస్ స్టాండ్ కెళ్ళాడు."
"అయితే ఏర్పాట్లన్నీ చేస్తానుమరి.....అట్టే టైము కూడా లేదు" హడావుడిగా లేస్తూ అందామె.
"మీరేం హడావుడిపడకండి! స్వరూపని ఇప్పుడు తీసుకెళ్ళడం లేదు. తరువాత అబ్బాయివచ్చి తీసుకొస్తాడు."
ఈ మాటకు తెల్లబోయిందామె. కాని వెంటనే తేరుకొని "సరే! అలాగే కానీండి మీ ఇష్టం" అని ఊరుకుండి పోయింది.
మరుక్షణంలో ఈ వార్త ఇల్లంతా పాకిపోయింది.
"మీ వంట్లో స్వస్థత చేకూరాకే అమ్మాయిని తీసుకెళ్ళండి" చిన్నబోయిన మొఖంతో అన్నాడు స్వరూప తండ్రి.
పక్కగదిలోనుంచి ఈ తర్జన భర్జనలన్నీ వింటూనే ఉంది స్వరూప. ఇదంతా సురేంద్ర ఆడిస్తోన్న నాటకమే అని ఆమెకు అర్ధమయిపోయింది. తనని దూరంగా ఉంచడానికే ఈ గొడవంతా! అలాంటి మూర్ఖుడితో సంసారం చేయటం తనకూ అయిష్టమే! ముందు వెనుక లాలోచించ కుండా, తనే పరిస్థితిలో ఈ వివాహం చేసుకోవాల్సి వచ్చిందో, తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడి తన మనసు నొప్పించిన మొగాడు తనకు భర్తగా ఉండటం కంటే ఉండకపోవడమే మంచిది. ఎంతో విశాలహృదయుడని పొరపాటుపడి ఈ పెళ్ళికి వప్పుకుంది తను. ఇందులో తన తప్పూ ఉంది. ఐనా తన మనసు ఏనాడో చచ్చిపోయింది. ఈ వివాహం కేవలం శరీరానికే! తల్లిదండ్రుల దుఃఖం పోగొట్టడానికే చెల్లెలి వివాహానికి ప్రతిబంధకం కాకూడదనీ-ఇందుకు వప్పుకొంది! అంతేగాని శరీర సౌఖ్యాలుఆశించి గానీ, అతనినిచూసి ప్రేమించిగానీ కాదు!
రాధమ్మ తన దగ్గరకు రావడంచూసి-ఆలోచనల లోంచి బయటపడి-పెదాలమీదకు చిరునవ్వు తెచ్చుకొంది స్వరూప.
"నాకు వంట్లో బాగుండక హఠాత్తుగా వెళ్ళిపోతున్నా మమ్మా! తర్వాత అబ్బాయ్ వచ్చి నిన్ను తీసుకొస్తాడు..."
స్వరూప ఏమీ మాట్లాడలేదు. ఇద్దరి మనసులూ విరిగిన తర్వాత-కలసి జీవితంగడపకూడదని నిర్ణయించుకొన్న తర్వాత-మరింక ఈ నటనలెందుకు? మనసులోని విషయం అందరికీ తెలియజేసి ఎవరి త్రోవనవాళ్ళు పోతే బావుంటుంది కదా!
రాధమ్మ వెళ్ళిపోయింది.
ఆమె వెనుకే తనూ బయటికొచ్చింది స్వరూప.
తల్లీ తండ్రీ వాళ్ళ ప్రయాణానికి సన్నాహాలు చేస్తున్నారు.
"ఒకవేళ వాళ్ళకి మనమీదేమీ కోపం రాలేదు కదా" అంది తల్లి.
"అలాంటిదేమైనా ఉంటే అమ్మాయ్ మనకి చెప్పకుండా ఉంటుందా? అదీగాక అతనే ఏరికోరి చేసుకొన్న వివాహమాయె! ఇంక కోపతాలెందుకుంటాయ్?"
వారి మనసులో చోటుచేసుకొన్న ఆదుర్దా, భయం ఎందుకో స్వరూపకు తెలుసు! లోలోపల ఎంత చిత్రవధ అనుభవిస్తున్నారో కూడా తను తేలికగా వూహించుకో గలదు. కూతురి గత చరిత్రను దాచి వివాహం చేసిన తల్లి దండ్రులెవరయినా సరే ఆ బాధ, భయం అనుభవించాల్సిందే.
"నువ్వెళ్ళి అతనికి భోజనం ఏర్పాట్లు చూడమ్మా" అంది తల్లి స్వరూపను చూడగానే. ఆమె అక్కడినుంచి కదల్లేదు. చెప్పాలనుకొన్నది చెప్పడానికి ఆమెకు మనసొప్పటంలేదు. చెపితే ఏం జరుగుతుందో ఆమెకు బాగా తెలుసు. అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. తల్లి అలాగే నిశ్చేష్టురాలయిపోతుంది. తండ్రి మొఖం చాటు చేసుకొని బయటికెళ్ళిపోతాడు. ఇల్లంతా దుఃఖంతో నిండిపోతుంది ఎవరినివారే నిందించుకొంటారు. కొన్ని రోజులవరకూ అందరి మనస్సులో అశాంతి అల్లుకుపోతుంది. ఊళ్ళో కూడా ఈ విషయం తెలిసిందంటే-మరింత హేళన-వెక్కిరింపు-వీటిని భరించగలశక్తి తన తల్లిదండ్రులకుందా?
"అమ్మా" నెమ్మదిగా పిలిచింది స్వరూప.
తల్లి తలెత్తి చూసింది. తండ్రి చేస్తున్న పని ఆపి కూతురివేపు చూశాడు.
స్వరూప ఏమీ మాట్లాడలేకపోయింది. ఉహుఁ! తన వల్ల కాదు! ఇప్పటికే వాళ్ళకు ఎంతో మనఃక్లేశం కలిగించింది కనీసం ఈ కొద్దిరోజులయినా తన వివాహం తాలూకు ఆనందం వారికి దక్కాలి.
నెమ్మదిగా అక్కడినుంచి తన గదివేపు నడిచింది ఆమె.
మధ్యాహ్నం అదే గదిలో సురేంద్రకు తనకూ కలిపి భోజనం వడ్డించారు.
"మీవాళ్ళెంత బలవంతపెట్టినా-నా దగ్గరకు రావటం గానీ-నాకు ఉత్తరాలు రాయటంగానీ చేశానంటే నేను దుర్మార్గుడినయిపోతాను! గుర్తుంచుకో" తీవ్రంగా అన్నాడతను.
"అలా చేయడానికి నేనేం మానాభిమానాలు లేని దాన్ని కాదు" రోషంగా అంది స్వరూప.
"సిగ్గులేదూ ఆ మాటనడానికి? నీ కృష్ణలీలలు సంగతి మర్చిపోయావా?" వెటకారంగా అన్నాడతను.
"మీతో వాదించేంత అవసరం నాకు లేదు."
"నీకీపొగరు ఇంకెంతో కాలం ఉండదులే! ఇకనుంచి నీ హోదా చాలా బావుంటుంది? 'మొగుడొదిలేసిన స్త్రీ' అంటారందరూ! జీవితమంతా ఈ పేరుతో కుళ్ళి చావవలసిందే! ఒకవేళ నీకు విడాకులిస్తానని ఆశపడుతున్నావేమో! ఆ ఆనందంకూడా నీకు దక్కనివ్వను! నా జీవితం ఏమయిపోయినా ఫరవాలేదు! చేసిన మోసానికి జీవితాంతం నువ్వు క్షోభించిపోవల్సిందే"
"నే నెవర్నీ మోసగించలేదన్న నమ్మకం నాకుంది!" పౌరుషంగా అంది స్వరూప.
"వివాహానికి ముందు మరోడితో ప్రణయకలాపాలు జరపడం తప్పు కాదన్న మాట?"
"పెళ్ళికి ముందు మరో ఆడపిల్లతో ప్రేమకలాపాలు జరపని మొగాళ్ళెంతమంది ఉంటారు? వాళ్ళది తప్పు కాదు! వాళ్ళకే పాపమూ అంటదు! వాళ్ళ పవిత్రత చెడదు. ఆ పనే ఆడది చేస్తే అది పాపం! మోసం! అపవిత్రత ఇలాంటి నియమా లేర్పరిచింది. మీలాంటి స్వార్ధ పరులయిన మొగాళ్ళు కదూ? నన్ను వివాహం చేసుకునే ముందు మీరు మరే ఆడదానితోనూ కామకలాపాలు జరపలేదా? మీ తల్లిగారి సాక్షిగా జరపలేదని చెప్పండి..."
సురేంద్ర నివ్వెరపోయాడు! కోపం అణచుకోలేక ఆమె చెంపమీద బలంగా కొట్టాడు. ఈ నీచురాలు తననే ప్రశ్నిస్తోంది! హఠాత్తుగా అతనికి సీత గుర్తుకొచ్చింది తనకి సీత ప్రేమలేఖలు రాసింది. తనూ ఆమెకి రాసాడు అయితే అదీ ఇదీ ఒకటెలా అవుతుంది? అయినా ఆ విషయం మాట్లాడేంత ధైర్యం దీని కెవరిచ్చారు?
"నీలాంటి దాన్తో వాదించడానికీ, తుచ్చమైన విషయాలకీ నా తల్లి సాక్షిగా కావాలంటావా? అసలు నిన్ను చంపకుండా వదలటం నా పొరపాటు!" ఉద్రేకంగా అన్నాడు.





