Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
అడుగడుగునా మానవ మహీయఃప్రభుత్వాన్ని
గరీయఃప్రతిభని అడుగుకి త్రొక్కి
ఓడించాలని మించుకోవాలని
క్రమ్ముకుంటోంది మంచు
అనాదినుండి చీకటిలో చెయ్యికలిపి
పగటి వెలుగుతో బాంధవ్యం నటించి
సాబటేజ్ చేస్తోంది మంచు
అలసటని సుఖంగా అనాలోచనని సమాధ్యవస్థగా
కెమో ఫ్లేజ్ చేస్తోంది మంచు
సంకల్పం ప్రభవించే అంగారస్థానంలోనే
స్థావరం ఏర్పరచుకుని
గర్భస్రావం కలిగిస్తోంది మంచు
సత్యం శివం సుందరం త్రిముర్త్యాత్మకమైన
శ్రీమదా ధర్మదేవీ సాక్షాత్కారాన్ని నిరోధించి
ఆముష్మికపు ఆశతో
సంప్రదాయ చ్ఛలంతో స్వర్గ నరకభయంతో
ఆలోచనా సాహస వైహాయస వీధుల నావరించి
జీవన వనంలో ఆకుల్ని పువ్వుల్ని రాల్చి జిఘృక్షను కూర్చి
చలితో వణికించి పొగతో వంచించి ధరాతలాన్ని
ముంచెత్తి కురుస్తోంది మంచు
3
హల్లో డాక్టరుగారూ
అయ్యో డాక్టరుగారూ
చుంచుకాదు సార్... మంచు మంచు
స్నో, ఫాగ్ - సైలెంట్ స్నో -
డైడ్ వుల్ స్నో... ఎడ్గార్ స్నో
నిరాశమంచు నిస్పృహమంచు
నీ మీదా నా మీదా అందరిమీదా
నమ్మకంపోయిన సినికల్ మంచు
వాడి తలమీద వాడి వొంటిమీద వాడి కడుపులో వాడి గుండెల్లో
అబ్బ వర్షంకింద కుంభినీ పాతంకింద
కురుస్తోంది
కురుస్తోంది
కోస్తోంది
కత్తి అంచులాంటి మంచు
కరకు మంచు మెరుపు మంచు
అయ్యా డాక్టరుగారూ రావాలి గబగబ రావాలి



