Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
అదిగో మళ్ళీ మైకంలో పడిపోతున్నాడు
మంచుకి కొంకర్లు పోతున్నాడు
మనకి కాకుండా మరో జీవితంలోకి
చచ్చిపోతున్నాడు
బజారు మనిషిలా మాటాడేస్తున్నాడు
ఇజాల నుండి కాపాడతానంటాడు
నిజాల కైజారుతో దొంగ బ్రతుకుల్ని పొడిచి
పచ్చి నెత్తురులో నూతన సంగీతం పలికిస్తానంటాడు
అయ్యా డాక్టరుగారూ
ఇది తప్పకుండా సంధి పేలాపన
కాదంటే ఉన్మాదం - ఇది వాడికీ మనకీ ప్రమాదం
నిఖరమైన నెత్తుటిలో సంగీతం పలికిస్తానంటాడు
అయ్యా డాక్టరుగారూ రావాలి గబాగబా రావాలి
ఇది తప్పకుండా సంధి పేలాపన
ఇది మన సుఖ భద్రతల కుద్వాసన
ఇది క్లుప్తసౌరము అపస్మారము కృత్త చేతనము
హల్లో డాక్టరుగారూ
అయ్యయ్యో డాక్టరుగారూ - రండి రండి!
అతని కనురెప్పలమీద పడింది మంచు
సనాతనా
కాస్మిక్ కిరణాల నిటువైపు ప్రసరించు
అతని గుండెనంతా కప్పింది మంచు
అధునాతనా
కరుణామసృణారుణ కవిత వినిపించు
అతని బ్రతుకుమీద పరచుకొంది మంచు
అనూన విజ్ఞానధనా
కాలసంకీర్ణ సౌవర్ణ చరణ మంజీరాల రవళించు
ఇది తెల్లని చీకటి
ఇది మృత్యువు విసరిన చల్లని దుప్పటి
ఇది మంచు
ఇది మంచుకప్పిన బాట
ఇది మంచులో యిరుక్కున్న పాట
కనిపించదు కోట
ఇపుడు నరాలు జివ్వుమని తెగెను
ఇది మనిషి వాంఛలు కెవ్వుమని సురిగెను
ఇది వ్యాధి సుమా సమాధి సుమా
ఇది దృశ్యాదృశ్య విభ్రమచణము హిమము
ఇది విచిత్ర తమము ధవళవిషార్ణవ ఫేనము!
ఇజి జడీభూత మనస్సుమము
ఇది నిస్పృహాచ్ఛలిత శూన్యజీవన గగనము
ఇది అంచు తెలియని భావి కనిపించని చావి
ఇది జడిమ
ఇది రెండుకొండల నడిమి
ఇది మానవుడి ఓటమి
ఇది మంచు
ఇది మంచు



