Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
మంత్రం చదివి సీసాలోకి పట్టమంటాడు
వణికిపోతున్నాడు
వాలిపోతున్నాడు
మంచులో కప్పుకుపోతున్నాడు
మంచులో కూరుకుపోతున్నాడు
మాయ మంచు అనుమానం మంచు
అవిధేయత మంచు మూగబాధవంటి మంచు
మూలుగుతూన్న మంచు ముసరి ప్రాణమూలాన్ని తాకి
చల్లారిస్తున్న మంచు
డాక్టరుగారూ
డాక్టరుగారూ
రండి రండి వేగిరం రండి సార్
హలో హలో.... హలో డాక్టర్!
2
ఆల్ఫ్స్ పర్వతశ్రేణి పైన హిమవన్నగ పంక్తులపైన
సైబీరియాలో సియర్రా నెవడాలో
అంటార్కిటిక్ సముద్రంమీద ఆస్ట్రేలియన్ స్చెప్పీలమీద
కురుస్తోంది మంచు
దారి కనపడక
కొండ తగిలి పేలిందొక విమానం
మంచు పడిన దారుల్లో
మంచి వంటి వెలుతురు లేక
జారి జారి అగాధాల్లో
కూరుకు పోతున్నారు
అణ్వస్త్రభయం వంటి మంచు
నియంతల నిర్దయలాంటి మంచు
నీకూ నాకూ మధ్య నిజాన్ని దాచిన మంచు
మనిషికీ మనిషికీ మధ్య మమతను కప్పిన మంచు
కాళిదాసు శ్లోకం బీధోవెన్ సోవెటా
లియొనార్డో చిత్రం లేపాక్షీ శిల్పం
సూచించిన సౌందర్యలోకాల నాహరించి
ఏసుక్రీస్తు తధాగతుడు ఏతన్మధురోహల నధఃకరించి
గతం భవితవ్యం కనిపించనివ్వని
ప్రగాఢ జడిమ యీ హిమభ్రమ
అనాదిగా అవిరళంగా కురుస్తోంది
అర్క విద్రోహబుద్ధితో మంచు



