Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
మంచు
హలో హలో... నేనండి నేను.... నేన్నేను
డాక్టర్ గారున్నారా.... అర్జంటు సార్ వెరీ అర్జంట్!
మావాడు బిగుసుకుపోతున్నాడండీ--- ప్రమాదం
మంచుపడి చల్లబడి నల్లబడి చచ్చిపోతున్నాడండి
హలో హలో
హయ్యో హయ్యో
అయ్యా అయ్యా
ఒకసారి రండి రక్షించండి దయుంచుండి
నుంచున్న పళాన రండి
ఏఁవిటి పడిం దంటారా
ఇంకా ఏఁవిటంటారేఁవిటండీ
చీకటిపడింది జీవితఘటానికి చిల్లుబడింది
బ్రతుకు అంచుమీద నల్లని దుఃఖపు కెరటం విరుచుకుపడింది
అయ్యా డాక్టరుగారూ
అబ్బా డాక్టరుగారూ
మావాడు మావాడు కాకుండా మారిపోతున్నాడండి
మానుంచి మంచిరోజులనుంచి జారిపోతున్నాడండి
భయపడి భయంకర శిఖరాల మీదనుంచి దూకుతున్నాడండి
ఇంకేదిదారి దేవుడా ఇదెలా భరించగలం దేవుడా
అయ్యయ్యో డాక్టరుగారూ
ఏఁవండీ డాక్టరుగారూ
రెండు ప్రపంచయుద్ధాల మంటలమధ్య
చర్మం కాలిపోతూ స్వప్నం రాలిపోతూ
నడచివచ్చాడు.
చచ్చిపోయిన వేలాది సైనికుల మధ్య
తన శవాన్ని చూసి ఉలిక్కిపడి జబ్బుపడ్డాడు
అడుగడుక్కీ యిజాల గోతుల్లోపడి
వొళ్ళంతా కొట్టుకుపోయి బేజారెత్తిపోయాడు
మొన్న ఎన్నికల్లో తిరిగి తిరిగి అభ్యుర్ధులిద్దరిలో
ఎవడెక్కువ నీచుడో తెలుసుకోలేక
పిచ్చెక్కి జుట్టు పీక్కున్నాడు
వాళ్ళమ్మ వొంటి ముడతల్లో తండ్రి దౌర్జన్య శాసనలిపిని
చదివి జాలిపడి ఏడ్చాడు



