Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
శ్రీ శ్రీ
అతని శైలి శైలూషి
ప్రజా శ్రేయోభిలాషి
కృష్ణశాస్త్రి
ఒక స్వప్నం ఒక బాష్పం
మెదిపిన సుగంధ ద్రవ్యం
విశ్వనాధ
విశ్వనాధ వైశ్వానర
కీలార్చిన వాగేశ్వరి
సగం మెరిసె సగం వడలె
* * *
---1966
చిన్నారికి చిన్నమాట
జీవితం సంగీతం పెట్టె మీద
చిగురుటాకు అంగుళులను కదలనీ
పలుకుతుంది హిందోళ
ఒలుకుతుంది నవహేల
అప్పుడు
బ్రతుకే ఊగే ముత్యాల ఉయ్యాల
జీవితం నవనీతం పాత్రమీద
చెదరిపడనీకు రాయినీ రప్పనీ
పగులుతుంది స్వప్నం
రగులుతుందీ దుఃఖం
అందుకే
బ్రతుకే ఉలిపిరి కాగితం చందం
జీవితం దేవతల దరస్మితం
చిన్నారీ! పెదవిమీద సింగారించు
కలతవద్దు కొలతవద్దు
అలసట అలజడివద్దు బాల!
అపుడు
బ్రతుకే లలిత లలిత లతాంతమాల
* * *



