Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
త్రిమూర్తులు
(పాఠాంతరం)
ఒకడు
మావాడే
మహాగట్టివాడు
మకుటంలేని మహరాజయ్యేవాడు
కానీ ముసలిదాన్ని
మూలకూర్చున్నదాన్ని
మసక మసక కన్నులదాన్ని
మనుధర్మశాస్త్రప్పందిరిలో
మనువాడాలన్న తొందరలో
మంచీ చెడ్డా మరిచిపోయేవాడు
మర్యాదలతిక్రమించాడు
మరి పనికిరాడు.
మరొహడు
మల్లెపూల మీద పరుంటాడు
మంచి గంధం రాసుకుంటాడు
మరి ఎందుకేడుస్తాడు?
మంచి పనివాడు
మాకు నచ్చినవాడు
మంత్రనగరానికి వెళ్ళొచ్చినవాడు
మధ్య మధ్య మాధ్వరసం చేదంటాడు
వధ్యశిల మీద విరహగీతం రాస్తాడు
మాతో పాటు నడుస్తానంటాడు
మరి నిజంగా వస్తాడా?
మారిపోయిన జగాన్ని చూస్తాడా?
మరొహడు
అరె! వీడు చిచ్చర పిడుగు
ముందుకు వేసిన అడుగు
ఎండలో నడిచే మనుషులకి గొడుగు
మాకు చిన్నన్న!
కానీ అన్నన్న!
(మరి చెవులో చెపుతాను వినండి)
యీ మధ్య నిజాయితీ మధ్య
పానీయాల సేవనా మద్య
సద్యః ప్రాప్త భావశూన్యుడై
మత్తుగా పరుండి నిద్రపోయాడు
మరి యిప్పట్లో లేవడు.
(ఈ మువ్వురూ తెలుగు సాహిత్య లోకానికి చెందినవారు - వీరెవరో చెప్పుకోండి.)
(ఆంధ్రప్రభ వారపత్రిక, 1966)
* * *



