Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
త్రిమూర్తులు
ఒకడు
మా వాడే - మహగట్టివాడు - మకుటంలేని మహరాజయ్యేవాడు
కాని ముసలిదాన్ని, మసక మసక కన్నులదాన్ని,
మూల మూల ముడుచుకు కూర్చున్న దాన్ని
మనువు చేసుకోవాలన్న ఉబలాటంతో
మంచీ చెడ్డా మరిచిపోయాడు
మర్యాదల్ని అతిక్రమించాడు
మరి పనికిరాడు
మరొకడు
మల్లెపూల మీద పరుంటాడు, మంచిగంధ రాసుకుంటాడు
మరి ఎందు కేడుస్తాడు?
మంచి పనివాడు, మాకు నచ్చినవాడు, మంత్రనగరానికి
వెళ్ళొచ్చినవాడు
మాతోపాటు నడుస్తానంటాడు
మరి నిజంగా వస్తాడా?
మూడోవాడు
అరె! చిచ్చరపిడుగు, ఎండలో నడిచే మనుష్యులకి గొడుగు
ముందుకు వేసిన అడుగు
మాకు చిన్నన్న కానీ అన్నన్న! ఈ మధ్య విదేశాల చవకబారు
పానీయాలు సేవించి
మత్తుగా పడుకున్నాడు
మరి యిప్పట్లో లేవడు.
* * * ----1966



