Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
శంకరుడూ సాంతాయనుడూ వీరి ఫింగర్ టిప్పుమీద
కారల్ మార్క్సు కిర్కుగార్డూ వీరి హృదయాంతరాళంలో
బీటిల్సూ బీట్నిక్సూ వీరి జిహ్వాగ్రం మీద
ఆరెంజ్ ఫ్రీస్టేట్ లో వీరు ఉపన్యసించారు
అరిజోనాలో సత్యాగ్రహం చేశారు,
వన్ వరల్డురాస్తూ నెండెల్ విల్కీ వీరిని సంప్రదించారు
ఆస్ట్రేలియన్ ఎబోరిజన్సుమీదా నెసెసిటీ ఆఫ్ ఎబోర్షనర్సు మీదా
కలిపి ఒకే ఒక ఉద్గృధం రచించారు
గాంధీకి గాడ్సేకీ దాన్ని అంకితం యిచ్చారు.
మొదటభార్య నీయన వదిలేశాడు
రెండో ఆవిడ యీయన్ని తగిలేసింది
మూడో పెళ్ళాంకోసం మొనాకో పేపర్లలో ప్రకటించారు.
ఫ్లీట్ స్ట్రీట్ లో బాండ్ స్ట్రీట్ లో వీరి మాట వేదవాక్కు
స్ట్రిపీజ్ లో ఫస్టు షోలో ఫస్టుసీటు వీరికి జన్మహక్కు
పారిస్ లో కవితనీ షాంపేన్ నీ కలిపి సేవించారు
ఫ్లారెన్స్ లో యువతినీ ప్రకృతినా కలిపి అనుభవించారు
ప్రీలాన్స్ జర్నలిస్టు, వార్ కరస్పాండెంట్, వెంట్రిలోక్విస్టు
వీరు చూడని దేశం లేదు, పొందని అనుభవం లేదు
అణుధామం వంటి వీరి జీనియస్ భవిష్యత్తులో
అరవై శతాబ్దాల మీదికి కమ్ముకుంది
సకల సిద్ధాంతాలు మతాలూ యిజాలూ సైంటిఫిక్ నిజాలూ
అన్నీ కలబోసి రంగరించి ఒకే ఒక రహస్యం కనుక్కున్నారు
దాన్నే తన మరణానంతరం 'ఎపిటాఫ్'గా ఎన్నుకున్నారు
"దేవుడూ మానవుడూ వీరిద్దరే యీ అనంత విశ్వంలో మూర్ఖులు
ఏ కోణం నుంచి చూచినా వీరిద్దరూ మిజరబుల్ ఫెయిల్యూర్స్"
* రష్యాలో కమ్యూనిస్టులను 'రివిజనిస్టు'లనీ, చైనాలోని నేటి పిడివాదులను 'రివల్యూషనిస్టు'లని అనడం కుహనా మార్క్సిస్టుల ఫాషన్ - ప్రచురణ కర్తలు
* * *
---1966



