Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
అయ్యయ్యో అలా చూడకండి ఎండిన కళ్ళతో బిగించిన పళ్ళతో
ఏడు పింకిపోయిన ఎడారి రొమ్ముల్ని చూపించకండి
ఏం చెప్పను మీకు ఎవారు జవాబుదారీ అని చెప్పను
చీకటి పడేవేళ
చిరుత పులులు పశువుల్ని నోట కరుచుకుని పోయేవేళ
పాడు బావిలోకి పడుచు విధవలు దూకేవేళ
చచ్చిన చరిత్ర బొమికలకోసం కుక్కలు కొట్లాడుకునే వేళ
దెయ్యపు మర్రిచెట్టుమీద దీనంగా అరుస్తూ పిట్టలు కళ్ళు తేలవేసే వేళ
ఏదో భయం భయం
చుట్టూ నురగ విషం
ఉరగ విషం
మృషా విషం
బాధా విషం
దుఃఖ విషం
పొర్లి పొర్లి పొంగి పొంగి వస్తున్నది
అమ్మా వెళ్ళండమ్మా
ఎందుకిలా వొంగి వొంగి కుంగి కుంగి
ఈ సమాధుల చుట్టూ వెతుక్కుంటూ తిరుగుతారు
శవాలు మాట్లాడవు
సమాధులు చూపించవు
మృత్తిక గుర్తించదు
మిత్తికి దయవుండదు
మీ రోదన మీలోనే అణుచుకుని
మీ కళ్ళను మీరే పొడుచుకుని
ఇలాగ యిలాగ యీ పాముల పుట్లమ్మట
ఈ మొండి చెట్లమ్మట యీ కూలిన గట్లమ్మట
వెళ్ళిపొండి వెళ్ళిపొండి వెళ్ళిపొండి
* * *
---1966
కాస్మాపాలిటన్
రష్యాలో 'రివిజనిస్టు'* వోడ్కా సిప్ చేసి
చైనాలో 'రివల్యూషనిస్టు' సప్పర్ భోంచేసి
అమెరికా హాలీవుడ్ తారాపథాలమీద చక్కర్ కొట్టి
స్పెయిన్ లో రెయిన్ లో తడిసి
ఇరాన్ లో కొరాన్ చదివి
ఈ రోజునే ఇండియా వచ్చేశారు వీరు
కాస్మాపాలిటన్ బోర్ వీరి మారుపేరు



