Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
ఒకటే మార్గం ఉంది
అన్ని దేశాలలో ఏడూస్తున్న
కొత్త కొత్త విధవల్ని తీసుకురండి
ఐడెంటిఫికేషన్ పెరేడ్ పెట్టిస్తాను
యు యన్ ఓ పీస్ కమిషన్ ఛైర్మన్ గారూ!
భయపడకండి!
ఇదేం కష్టం కాదు వినండి
ఇదంతా తద్విధల కన్నీటితో తడై బురదై
పోతుందని భయపడకండి!
నెత్తురు వరదల్ని చూసిన మనకి
కన్నీటి వాన లెక్కా జమా?
బాల్చీలు సిద్ధం చేయిస్తాను నేను
విధవల్ని వరుసలో నిలబెట్టండి మీరు!
ఒకవేళ వీడొక పెళ్ళికాని
బ్రహ్మచారైతే ఎలాగ?
చచ్చాంరా బాబూ!
* * *
---1954
వెళ్ళిపొండి, వెళ్ళిపొండి
ఎవరు మీరంతా ఎందుకిలా వొంగిన నడుంతో కన్నీటితో
చెదిరిన జుట్టుతో జారిన పైటలతో
ఈ సమాధుల చుట్టూ వెతుక్కుంటూ తిరుగుతారు
తల్లులా బార్యలా అక్కచెల్లెండ్రా మీరు
ఏనాటివారు ఏ ఏటివారు మీరు
ఏ యుద్ధంలో చనిపోయాడు మీవాడు ఏ దళం ఎన్నవ నంబరు
కురుక్షేత్రమయితే కృష్ణుణ్ణి అడుగు
పానిపట్టయితే పీష్వాల నడుగు
బొబ్బిలయితే బుస్సీ నడుగు
క్రిమియా యుద్ధం కొరియా యుద్ధం
ప్రధమ ద్వితీయ ప్రపంచ యుద్ధాలు
బిస్మార్క్ నడుగు హిట్లర్ నడుగు
బ్రహ్మదేవుణ్ణి అడుగు



