Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
సన్నగా చారకట్టిన రుధిరం నీ కళ్ళలోకి ప్రాకినపుడు
నీ కలలో ఎర్రని సముద్రాలు పొంగినపుడు
నల్లని పర్వతాలు కూలినపుడు
నీ అడుగులక్రింద కపాలాలు వికృతంగా నవ్వినపుడు
నిన్న రాత్రి నీ గుమ్మం ముందు నిలబడి పిలిచిందెవరని, పోవెల్ శవం
నా గది కిటికీ ఊచల నానుకుని దీనంగా చూసినది పోవెల్ శవం
ప్రతి దారి మలుపులో నిలదీసి అడిగినది పోవెల్ శవం
ప్రతి గుండెలో గిజగిజలాడి కొట్టుకున్నది పోవెల్ శవం
బ్రతికిన పోవెల్ భాష తెలియనివాడా, చచ్చినవాని శవం పలకరిస్తే
వినలేవా?
అయ్యో సూర్యనారాయణా, అబ్దుల్ ఖాదర్, మిస్టర్ విలియమ్స్,
నూ - విన్, క్లోజర్ నెక్రోవ్! దేశదేశాల మనుష్యుల్లారా?
చచ్చిన పోవెల్ మీ తమ్ముడు, మీ మేనల్లుడు, మీ లోపలి మానవుడు
నీడలమధ్య పాముంది అడవులమధ్య పులివుంది జాగ్రత్తగా చూచినడు
ప్రతి ఒక్కడూ దీనికి బాధ్యుడు-చరిత్ర పగనెవడూ తప్పించుకుపోలేడు
(హార్లెం శవం స్క్వేర్ నీగ్రోల కాటపట్టు. పోవెల్ తన విద్యార్ధి మిత్రులతో కాలక్షేపం చేస్తూండగా ఒక తెల్లదొర అవమానించాడు. అదేమని ఎదిరించిన పోవెల్ ని దారుణంగా కాల్చి చంపేశాడు.
పోవెల్ అంత్యక్రియలు దుఃఖిత క్షుభిత నీగ్రో సమాజం కన్నీళ్ళతో నిశ్శబ్దంగా వీక్షించింది. వారి హృదయంలో ఏ ప్రతీకారానలం చెలరేగింది. ఏ స్వాతంత్ర్య దీక్షా కిరణం ప్రకాశించింది. ఆ సమయాన....)
శవం
ఈ శవం చాలా దుర్మార్గపు శవంలా ఉంది
ఇది సరిగ్గా యుద్ధ విరమణ రేఖ మీద వచ్చింది
మనందరికీ చచ్చే చావు వచ్చింది
మంచులో నాని నాని మాడి మాడి రూపం పోయింది.
మంచులో తడిసిన యూనిఫారమ్ ని
నక్కలు ముక్కలు చేశాయి
మరెవ్వరి దీ
సొల్జరు శవం
డెమోక్రసీదా? సోషలిస్టు కేంపుదా?
ఇంపీరియలిస్టుదా?
వీడి పెళ్ళాంకి వీడి ఆనమాలు తెలుస్తుంది
వీడి పెళ్ళామెవరో ఎలా తెలుస్తుంది?
వీణ్ణి ఏ సైనిక గౌరవాలతో, ఏ దేశ నినాదాలతో
తగలెయ్యాలో, పాతిపెట్టాలో ఎలా తెలుస్తుంది?



