Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
ఇది తరుణ శృంగార
జీవన హేలకు ప్రతీక
చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు
గానపు తెన్నుల
జారెను తోటల
కొబ్బరి మొవ్వుల
ఇంటిముందు బోగన్ విల్లా పువ్వుల
ధనికుల కిటికీ పరదా చిరుసందుల
సురతాలస నిద్రిత సతి కపోలమ్ముల
జారిన జార్జెట్ చీర జిలుగుటంచుల
చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు గానపు తెన్నుల
నిరుపేద కలలో
కదలిన తీయని ఊహల
ఊరిప్రక్క కాలువ అద్దపు
రొమ్ముల
ఊరి బయట కాలీకాలని
చితి కీలల
అడవిలోన వికసించిన
ఒంటరి పువ్వుల
చిందెను తెల్లని చల్లని వెన్నెల
చలిరాత్రుల మౌనపు గానపు తెన్నుల
* * *
---1965
హార్లెమ్స్ లో శవం
అమెరికాలో ఆ రోజున చరిత్ర భంగపడి ఏడ్చింది
అంత ఎత్తు భవనాల మీద నుండి తొంగిచూచిన ఆదిత్యుడికి
హార్లెమ్స్ లో జేమ్స్ పోవెల్ శవం కనబడింది
అవనీతలంమీద అకాలపు చీకటి పడింది
పదహారేళ్ళ పిల్లవాడు నల్లవాడు నీగ్రో కుర్రవాడు
ఆడుతూ పాడుతూ ఆశల కాంక్షల తోటల దోరగ పండిన కాయల్ని
అటుయిటు చూస్తూ బెదురుగా బెరుగ్గా కోసుకొనబోయేవాడు
తన రంగు నలుపైనందుకు తన అభిమానాన్ని చంపుకోనందుకు
తన పౌరుషం చూపించినందుకు తనూ మనిషేనని నిలబడినందుకు
వర్గం వర్గం కలసి అహంకృతితో ఎక్కుపెట్టిన తుపాకి దెబ్బకు
ఆహుతైనప్పుడు



