Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
వెన్నెల
కార్తీక మాసపు రాత్రివేళ
కావాలనే మేలుకున్నాను
చల్లని తెల్లని వెన్నెల
అంతటా పడుతోంది
మెత్తని పుత్తడి వెన్నెల
భూమి వొంటిని హత్తుకుంది
శిశువులాంటి వెన్నెల
నవ వధువులాంటి, మధువులాంటి వెన్నెల
శిశిరానిలానికి చలించే
పొరల పొరల వెన్నెల
శరద్రధుని సౌధానికి కట్టిన
తెరల తెరల వెన్నెల
ఎంత శాంతంగా,
హాయిగా, ఆప్యాయంగా ఉందీ!
చచ్చిపోయిన మా అమ్మ
తిరిగొచ్చినట్టుంది
స్వర్గంలో ఎవరో సంగీతం
పాడుతున్నట్టుంది
స్వర్గంలో అచ్చరలు
జలక్రీడ లాడుతున్నట్టుంది.
ఎంత నీరవ నిర్మల సౌందర్యం
నన్నావరించుకొంది?
ఏ చామీకర చషకంతో
నా పెదవుల కందిస్తున్నది!
ఈ రాత్రి నిద్రిత సర్వధాత్రిమీద
ఎవరు ఈ తళుకు తళుకు
కలల పుప్పొడిని వెదజల్లారు!
ఎవరీ మెరిసే ముఖమల్
జంఖానా పరచి వెళ్ళారు!
ఓహో! చంద్రకిత ధాత్రి
ఓహో! కోరకిత గాత్రి
ఓహో! శరధ్రాత్రి!
వ్యధలతో బాధ్యతలతో
భయాలతో మహితమైన
నా మనస్సు కిప్పు
డూరట కలుగుతోంది.



