Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
ద్వైతం
నువ్వు మా వూరొచ్చినప్పుడు
నేను మీ వూళ్ళో వున్నాను
నువ్వు మద్రాసులో దిగేవేళకి
నేను కలకత్తా రైలెక్కుతున్నాను
నువ్వు ఉత్తరధ్రువంలో విసిరిన అరోరా బొరియాలిస్ వి
నేను దక్షిణధ్రువతీరాన నిలిచిన పెలికిన్ పక్షిని
నీకూ నాకూ మధ్య ప్రేమ బద్ధవైరంలాంటిది
అది పరస్పర దూరీకృత సమర్ధమైనది
నీ ఆదర్శాలూ ఆశయాలూ
నీలాగా నాజూగ్గా అందంగా వుంటాయి
నువ్వు పాలమీగడల్లోంచి జాబిల్లి అడుగుమీదనుంచి
పువ్వుల పెదాలనుంచి నడిచి వచ్చావు
నాకు ఆదర్శాలు లేవు; ఆశయాల్ని నమ్మను
నేను మోటుగా, దిగులుగా వుంటాను
నేను జీవితం ముళ్ళకంచెల మధ్య, బురదగుంటల మధ్య
నిజంకోసం పరిశోధిస్తూ వుంటాను
నువ్వు తీరిగ్గా ప్రేమించి మేడమీద చెలికత్తెల మధ్య
విహరిస్తావు నిట్టూర్పులతో
నేను ప్రాకృతికమైన ఆకలినీ, పాశవికమైన కామాన్నీ
భరించలేక జుట్టు పీక్కుంటాను
నీకు సత్యం సత్పదార్ధం, అర్ధవంతం సంతతప్రకాశం
నాకు నిజం భయంకరం, అర్ధవిహీనం అసంపూర్ణం
ఏ కేంద్రంలో మన మిద్దరం కలుసుకోవడం?
ఏ అక్షాంశరేఖమీద నిలిచి కౌగిలించుకోవడం?
ఓ ప్రత్యూషపవనలోల మందార లతాంతమా!
నేను ప్రదోషవేళా తమాల శాఖాగ్ర ఘూకాన్ని
అటు-ఆనంద సుధర్మవైపు నువ్వు వెళ్ళు నక్షత్ర ధూళిని చల్లుతూ
ఇటు-కలల బూడిదరాసుల మీద కూలబడతా కన్నీళ్ళు చిమ్ముతూ
* * *
---1965



