Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి


    కాలానికి నిలబడ గలిగినదీ వద్దన్నా పోదు
    మరణించిన అవ్వ నగలు
    మన కాలేజీ అమ్మాయి ఎంత పోరినా పెట్టుకోదు
    యుగయుగానికీ స్వభావం మారుతుంది
    అగుపించని ప్రభావానికి లొంగుతుంది
    అంతమాత్రాన మనని మనం చిన్నబుచ్చుకొన్నట్టు ఊహించకు
    సంతత సమన్వయావిష్కృత వినూత్న వేషం ధరించడానికి జంకకు
    మాధుర్యం, సౌందర్యం, కవితా
    మాధ్వీక చషకంలో రంగరించి పంచిపెట్టిన
    ప్రాచేతస కాళిదాస కవిసమ్రాట్టులనీ,
    ఊహా వ్యూహోత్కర భేదనచణ
    ఉపనిషదర్ధ మహోదధినిహిత మహిత రత్నరాసుల్నీ
    పోగొట్టుకునే బుద్ధిహీనుడెవరు?
    ఎటొచ్చీ
    విధవలకీ వ్యాకరణానికీ మనిశిక్షాస్మృతికీ గౌరవంలేదని
          వీరికి లోపల దిగులు
    వర్తమానావర్త ఝంఝావీచికలకి కాళ్ళు తేలిపోయే వీళ్ళేం చెప్పగలరు?
    అందరూ లోకంలో శప్తులూ పాపులూ
    మనం మాత్రం భగవదంశ సంభూతులమని వీరి నమ్మిక
    సూర్యుడూ చంద్రుడూ దేవతలూ దేవుళ్ళూ
    కేవలం వీరికే తమ వోటిచ్చినట్టు వీరి ్హమిక
    ఇది కూపస్థమండూకోపనిషత్తు
    ఇది జాతికీ ప్రగతికీ కనబడని విపత్తు
    మనవేషం, మన భాషా, మన సంస్కృతీ,
    ఆదినుండీ, ద్రవిడ బర్బర యవన తురుష్క హూణులనుండీ,
    ఇచ్చినదీ పుచ్చుకున్నదీ ఎంతైనా వున్నదనీ,
    అయిదు ఖండాల మానవ సంస్కృతి
    అఖండ వసుదైక రూపాన్ని ధరిస్తోందని, భవిష్యత్ సింహద్వారం
                            తెరుస్తోందనీ,
    గ్రహించలేరు పాపం వీరు
    ఆలోచించలేని మంచివాళ్ళు
    ఏ దేశ సంస్కృతి అయినా ఏనాడు కాదొక స్థిరబిందువు
    నైక నదీనదాలు అదృశ్యంగా కలిసిన అంతస్సిందువు.

        *    *    *       
                ---1965




Related Novels


తిలక్ కథలు

అమృతం కురిసిన రాత్రి

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.