Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
దుర్మరణవార్త
అంతరిక్ష వలయంమీద
అవనీతల హృదయంమీద
కెనడీ దుర్మరణవార్త
కారుచిచ్చు అక్షరాల
లఖించింది.
నివ్వెరపడింది జగత్తు
నిజం నమ్మలేక పోయింది
చరిత్ర కేదో శాపం వుంది
ధరిత్రిమీద పాపం నిండింది
మానవప్రగతికి శ్రమించే
మంచివాళ్ళు మహాత్ములు
క్రూరంగా ఘోరంగా మడిసిన
దారుణ విధివిలాసానికి అర్ధం ఏమిటి?
బాపూజీ హత్యా విషాదగాధ
ప్రతిధ్వనించింది మళ్ళీ మనలో
మహాత్ముల మనీషుల రుధిరంతో
మరకపడింది ధరిత్రీ వదనం
* * *
నగరంమీద ప్రేమగీతం
టాంక్ బండ్ సన్నని నడుంచుట్టూ చెయ్యిచుట్టి
అందమైన నగర ముఖాన్ని దగ్గరగా తీసుకుని
ఆశలతో ఆలస్యమైన అబిడ్స్ కళ్ళలోకి చూసి
దీపాల వెలుతురు ప్రతిఫలించే చెక్కిళ్ళపై ముద్దు పెట్టుకో
సిగలో నౌపహాడ్ నాగరం తళుక్కున మెరుస్తుంది
బంజారాహిల్స్ వక్షోజాలుద్రిక్తంగ చలిస్తాయి
అలా అలా నైలాన్ చీరకింద మెత్తని గాగరాలో
సికిందరాబాద్ జఘనోరు సౌందర్యం నిన్ను కవ్విస్తుంది
వేలవేల బార్లలో కొన్నివేల నిషాగీతాల మధ్య
బాళిగొలిపే జవరాలి నృత్యం పరవశింప చేస్తుంది
ఓరగా తెరచిన జనానాల తలుపులలోంచి
ఉండి ఉండి నిలవగాలి వస్తుంది
హుసేన్ సాగర్ మీద ఒలికిన వెన్నెలలోంచి
ఒక విరహిణి మధు విషాదగాధ వినిపిస్తుంది.



