Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
అభినవ ఋగ్వాదం
తాజా సరుకు - తరుణం పోనివ్వకు
బాదం జీడిపప్పు - కవిత్వం అణా ఒక కప్పు
ఆడదాని అందంలాంటి అబద్ధాన్ని
అలభ్యమైన ఆనందంలోని రహస్యాన్ని
రెండూ కలిపి
రెండు గుక్కల్లో తాగు
రెండవ కంటివాడికి తెలియకుండా గుండ్రంగా చచ్చిపోతావు
ఎండా వానాలేని ఉన్మాద స్వర్గంలో పునర్జన్మిస్తావు
(అప్పులవాళ్ళూ ఆఫీసర్లూ అనాకారి భార్యలూ యింక బాధించకుండా)
2
సుబ్బారావు పెళ్ళాం సూర్యంతో లేచిపోయిన రోజున
కురిసిందిట కదూ కుంభవృష్టిగా వాన
ధార్మికులు దాన్ని దేవతల కన్నీటిసొన అన్నారు
నాస్తికులు రొమాంటిక్ తోటలో పూలతేనె అన్నారు
అసలు సుబ్బారావు నీతిశతకం రాసి అంతకుముందు రోజునే
అర్ధాంగికి అంకితమివ్వకపోతే ఇంతపని జరిగుండదని
గుడిపాటి వెంకటచలేయుడు గుండెబాదుకు చెప్పాడుట
3
అన్నాడు ప్రియురాలితో అన్నమాచారి
జూనియర్ యిమ్.యస్.సి. ఫిజిక్స్
ఇదివరకు నీవైపు న్యూటన్ థియరీ ప్రకారం ఆకర్షింపబడ్డాను.
అయిన్ స్టీన్ వచ్చాత థియరీ ఆఫ్ కర్వేచర్
ఆధారంగా నిన్ను ప్రేమించాను
ఇప్పుడెలాగు చెప్పు
హోయల్ నర్లేకర్లు వచ్చి అంతా ఉల్టా సీదా చేశారు
ఇంక నిన్ను అన్ సైంటిఫిక్ గా దేశవాళీగా ఆహ్వానిస్తాను
అపుత్రస్యగతిర్నాస్తి - అతివా నాకొక కుమారుణ్ణి ప్రసాదించు
4
నవలలు నవలలు రాసేస్తున్నారు
కవలల్ని క్యాడ్రుప్లెట్సుని సృష్టిస్తున్నారు (నవలల్లో)
వచనమైనా రచనమైనా పైచెయ్యి వాళ్ళదే
వచనం వదలి మగవాళ్ళు ని
ర్వచనంలేని కవితా కంటక వనాంతరాల వడి
ప్రవాసులై నిర్వాసులై పోతున్నారు
వర్ణనీయవస్తువే తిరగబడి వర్ణిస్తూంటే
కంచెయే చేను మేస్తూంటే---
హతవిధీ! ఇది కలికాలం, కలికికాలం!
* * *



