Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
ఇజాలూ రాజకీయాలు వాదాలూ హత్యలూ యుద్ధాలూ
ఇంకా యిటువంటి చెత్తా చెదారం మనస్సులో పేరుకోకముందు
పండిన మొగలి పొత్తివంటి పరిమళం గల ప్రారంభయౌవనపు నిండైన
ఆరోగ్యపు వాకిళ్ళముందు విరిసిన నందివర్ధనం పువ్వుల మధ్య
నువ్వూ నేనూ కూర్చొని అలాగ ఒకర్నొకరు చూసుకుంటూ
ఆకాశానికీ భూమికీ మధ్యపడిన చిరుచీకటి పలకమీద
రేడియం అక్షరాన్ని వ్రాసుకుంటూ
కాలాన్ని కదలకుండా నిలబెట్టి కమ్మని ఊహల పూలతోటల మధ్య
పరుగులెత్తి సాహసపు మంచుకొండల అంచులమీద స్కేటింగ్ చేసి
అకలుషితమైన యౌవనోల్భణంతో బలంతో అమాయకత్వంతో
ఆకాశాల ఆశల మేలు చాందినీలు కట్టి
నీ నా సామీప్యమే స్వర్గంగా స్రవంతిగా జీవిత
పరమార్ధంగా ఎంచి
నలుపు చారలు లేని తెల్లని సూర్యకాంతి పడిన పాలరాతి గచ్చులా
ప్రతిఫలించి
నీ వొడిలో నా తల పెట్టుకుని అభ్యంగనావిష్కృత త్వదీయ
వినీల శిరోజ తమస్స ముద్రాలు పొంగి నీ బుజాలు దాటి నా
ముఖాన్ని కప్పి ఒక్కటే ఒక స్వప్నాన్ని కంటున్న వేళ
చంద్రికాస్నపిత సంగీతాన్ని వింటున్నవేళ
ఆకుపచ్చని భూమికీ గిరులకీ ఝరులకీ సమస్త సృష్టికీ
ఒకే అర్ధం కనుక్కున్నవేళ
నీ పాట హాయిగా గాలిలో తేలి మునిమాపు జేగురులతో కలసి
దిక్కులను చుట్టి నీ మ-దు చలాంగుళిచ్ఛవిలో కరిగి
నా వొంటిని నిమిరి నన్ను నిర్ణిద్ర నిద్రలో పడవేసి నీ ఎర్రని
పెదాలు నా నొసటిమీద ఆనందపు నెలవంకల్ని చిత్రించి నన్ను
మంత్రించిన ఆ రోజులింక
రావు యిప్పుడు నువ్వులేవు నీ పాటవుంది నా లోపల లోపల
ఆరిన కుంపటిలో రగులుతున్న ఒకే ఒక స్మృత్యాగ్ని కణంలాగ
క్రమక్రమ జరా రుజాగ్రస్తమైన వయస్సునే పాడింటి మూలగదిలో
కుండిలో యింకా వాడకుండా నిల్చిన పువ్వుల గుత్తిలాగా
గడుసుదనం మోసం పరువూ ప్రతిష్టలనే గాడిదలమీద
బ్రతుకు పాతబట్టల మూటల్ని వేసి తోలుకున్న వేళ
నా ఏడుపు నాకు తప్ప లోకానికి వినిపించని వేళ
నే కూరుకుపోతున్న చాతకానితనపు వానాకాలపు బురదమధ్య
నీ పాట ఒక్కటే నిజంలాగ నిర్మలమైన గాలిలాగ నిశ్శబ్ద నదీతీరాన్ని
పలకరించే శుక్తిగత మౌక్తికంలాగ
ఇంటిముందు జూకామల్లె తీగలో అల్లుకుని లాంతరు వెలుతుర్లో
క్రమ్ముకొని నా గుండెల్లో చుట్టుకుని గాలిలో ఆకాశంలో
నక్షత్రం చివరి మెరుపులో దాక్కుని నీరవంగా నిజంగా వుంది
జాలీగా హాయిగా వినబడుతూ వుంది
శిశిర వసంతాల మధ్య వచ్చే విచిత్ర మధురమైన మార్పుని
గుర్తుకు తెస్తోంది యిన్నేళ్ళ తర్వాత
* * *
---1965



