Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
అదృశ్య శృంఖలాలబద్ద పాదాల నీడుస్తూ ఏడుస్తూ చప్పట్లు చరుస్తూ
కోలాహల హాలాహల నీలాచల గుహాంతరాలవైపు
కోష్ణకవోష్ణ స్వప్న రంభా పరీరంభపుకైపు
కోసం పోతున్నారు
దిగులుగా తిరిగి వస్తున్నారు
మూలగా నక్కి మూటవిప్పి చూసుకుని
ఏమీ దొరక్క మరేమీ తెలియక
మళ్ళీ అడ్రసులేని ఆనంద ప్రియబాంధవి కోసం
మరో మలుపు మరోదారి మరోవూరు వెళ్ళాలని
మంచుకప్పిన స్టేషన్ల దగ్గర విమానాశ్రయాల దగ్గర
పడిగాపులు పడి నుంచున్నారు
ఎడ్వాన్సు బుకింగ్ లేదు ఎప్పుడు రైలొస్తుందో తెలియదు
సిగ్నలిచ్చేవాడు తన గదిలో చిత్తుగా తాగి పడుకున్నాడు
* * *
కిటికీ తెరిస్తే
ఏపుగా పెరిగిన చెట్టుమీద ఎర్రని పువ్వొకటి విరిసి
ఎండలో మెరుస్తూ ఇదేనిజం ఇదేనిజం అని నవ్వుతూ
అంతలో రాలిపోయింది
వింతగా స్మృతిలో మాత్రం మిగిలింది
* * *
---1965
నువ్వు లేవు నీ పాటవుంది
నువ్వులేవు నీ పాటవుంది; ఇంటిముందు జూకామల్లె తీగల్లో అల్లుకుని
లాంతరు సన్నని వెలుతురులో క్రమ్ముకుని నా గుండెల్లో చుట్టుకుని
గాలిలో ఆకాశంలో నక్షత్రం చివరి మెరుపులో దాక్కుని నీరవంగా
నిజంగా వుంది జాలిగా హాయిగా వినపడుతూ వుంది శిశిర వసంతాల
మధ్య వచ్చే మార్పుని గుర్తుకి తెస్తోంది యిన్నేళ్ళ తర్వాత వేడిగాలి
చల్లదనానికి తిరిగే ఒక నొక గ్రీష్మ దివసావసాన సమయాన
డాబామీద
సిగ్గిలిన సోగకళ్ళతో మల్లెపూల వాల్జడతో నువ్వుపాడిన పాట
నా గుండెల దగ్గర తడబడుతూ ఏదో కొత్త భాషలో చెప్పి
ఒక అందమైన రహస్యం విప్పి పరువానికి వస్తున్న నా వయస్సులో
చటుక్కున పరిమళపు తుపానుల్ని రేపి మహారణ్యాల సౌందర్యాన్ని
చూపి సముద్రపు కెరటాల బలంతో మధ్యగా మౌనంగా వున్న
ద్వీపాల్ని ఊపి
ప్రపంచం యొక్క అవధుల్ని దూరంగా సాచి నన్ను దిగంతాలకి
విసిరేసిన వేళ



