Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
కిటికీ
కిటికీ తెరిస్తే
గాలీ వెలుతురుతో పాటు
జాలి జీవితపు ధూళీ జ్ఞానమధూళీ కూడా వస్తాయి
తెరచే కిటికీని బట్టి
పరతెంచే పుష్పపరాగం వుంటుంది
గదికీ మదికీ కూడా గవాక్షాలుంటాయి
అంతరిక్షంలోని జీవిత రహస్యంలోకి సృష్టి సమక్షంలోకి
విచ్చుకొనే విచిత్రాక్షి సమూహాలు
ఆనంద శోకానుభూత్యవిరళ తటిచ్ఛకిత వార్షుక వలాహకాలు
* * *
కిటికీ తెరిస్తే
కనబడుతుంది క్షితిజరేఖ
నాకూ అనంతానికీ మధ్య వ్రాలిన విలీన తమాలశాఖ
నాలోంచి కిటికీ లోపలికి సంకోచించుకు పోతున్న నేను
ఒకే ఒక కేంద్రంలో కలుసుకున్న ఉద్రిక్త క్షణంలో
ఉన్మదిష్ణువు సృష్టి వేణువూదిన రహస్యగానం వినబడింది
ఉత్తాల శిఖరంమీద పగిలిన సూర్యగోళపు కాంతి చెల్లాచెదురైంది
ఊదారంగు మంచు కురిసిన ప్రధమోదయదృశ్యం నాకు కనబడింది
* * *
కిటికీ తెరిస్తే
రోడ్డుమీద వచ్చీపోయే జనం
ఆశానిరాశల వంతెనల మీదనుంచి దిగుతున్నారు
ఆకలీ కామం అవసరాల మార్కెట్ కి వెడుతున్నారు
ఒకడు కంగారుగా ఒకడు రహస్యంగా ఒకడు బెదురుగా
ఒకడు ధైర్యంగా విలాసంగా మరొకడు కింగ్లీగా
ఆవిడ తలవంచుకుని నిత్యపాతివ్రత్య భారవహనంతో
ఈవిడ ఓరగా చూస్తూ పైట సవరించుకుంటూ లోపల్లోపల
గతుక్కుమంటూ
రోజుల స్తంభాల చుట్టూ తిరుగుతూ
కాలం కారిడార్లలోకి మసక మసక చీకట్లో సిలౌటీలు కల్పిస్తూ
ఎవరికివారే ఏకాంత పాంథులు



