Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
నిన్న రాత్రి
ఒకమాట చెప్పు
నిన్న రాత్రి దేవుడు వచ్చి నా మంచం మీద కూర్చొని
దీనంగా నాకేసి చూసి కన్నులు దించుకున్నాడు
ఏమైనా అన్నానా? నేనేమైనా అన్నానా?
ఆకలి అని ఆశలు గొని అన్నింటా విఫలుడై
ఆత్మహత్య చేసుకున్న అబ్బాయిని గురించి అడిగానా?
అమ్ముకొని యౌవనం, అలసిన జీవనం
సాగించి సాగించి సంధ్యవేళ ఉరి తీసుకున్న
సానిపడుచు మాట చెప్పానా?
చీనాతో యుద్ధంలో చితికిన కొడుకు వార్తవిని
చీకట్లో ఏట్లో దూకిన ముసలిదాని పసరుగుండె
నే చూపించానా?
కాంగోలో, క్యూబాలో, సైప్రస్ లో, లావోస్ లో
కాలి కమురు కంపుకొట్టే కాలం కథ, మానవ వ్యధ
నే వివరించినా?
నిజం చెప్పు, నిజం చెప్పు
నిన్ను గూర్చి, నన్ను గూర్చి
నిఖిల సృష్టిలోని ఖిలం గూర్చి
నీరవ సుందర హృదయపాత్ర
నిండిన హాలాహలం గూర్చి
నిజం చెప్పమని అడిగానా? నిందించానా? నిర్బంధించానా?
నాకు తెలుసు, నాకు తెలుసు
గొలుసులోని అసలు కిటుకు
నాకు తెలుసు, నాకు తెలుసు
దేవుని చెక్కిళ్ళమీద దీనంగా జారే కన్నీటిని
దీపకాంతిలో చూసి చటుక్కున జాలితో లేచి
కౌగిలించి, ఊరడించి
కన్నీటిని తుడిచి
వెళ్ళిరమ్మని వీధి చివరిదాకా సాగనంపి వచ్చాను,
నాకు తెలుసు, నాకు తెలుసు
మానవుడే దానవుడై తిరగబడినప్పుడు
పాపం పెద్దవాడు - కన్నకడుపు - ఏం చేస్తాడని!
* * *
---1965



