Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
లంచాలు పట్టడు, ఎవర్నీ తిట్టడు, ఎవరేమన్నా పట్టించుకోడు
నీతి నిజాయితీ వున్నవాడు, నిర్మలమైన దైవభక్తి వున్నవాడు
కాని - చనిపోయే ముందురోజునే కనకయ్య అనే మిత్రుణ్ణి కలుసుకుని
"సుఖమంటే ఏఁవిటి? ఎలా వుంటుంది? ఎక్కడ దొరుకుతుంది?" అని
అడిగాట్ట
ఈ సందేహం అతని జీవితానికే మచ్చ
ఇంకా పెరిగి పెద్దదవకుండా అతను మరణించడం దేశానికే రక్ష.
* * *
---1965
నేనుకాని నేను
నాకు మీ సాహిత్య వివాదాలు తెలియవు
నలుగుర్నీ మంచి చేసుకోవడం అంతకన్నా తెలియదు
ఒక నిశార్ధ భాగంలో నక్షత్ర నివహగగనం
ఓరగా భూమ్మీదకు వొంగి ఏదో రహస్యం చెబుతున్న వేళ
ఒంటరిగా నా గదిలో నేను మేల్కొని రాసుకుంటూంటాను
నా హృదయ స్పందన మాత్రం నాకు వినిపిస్తూ వుంటుంది
ఎదురుగా గోడమీద బల్లి ఏకాగ్రంగా నాకేసి చూస్తూ వుంటుంది
కిటికీ అవతల ఫెరన్ మొక్క క్రీగంట కనిపెడుతూ వుంటుంది
కీచురాళ్ళ చప్పుడు అప్పుడప్పుడు వినిపిస్తూ వుంటుంది
పాత ఇటికల గుట్టలో మెలికలు తిరిగిన పాము బద్ధకంగా కదులుతుంది
అదే సమయంలో లేత ఎరుపు ఆవేశాన్ని వొంటినిండా కప్పుకుని
కడుపులో వణికించే చలి కనబడకుండా ఆలోచనల మంటలంటించి
కళ్ళ చివర నేను కాని నీ వలపు దూరాన్ని ముడివేసుకొంటూ
గొణుక్కుంటూ పాడుకుంటూ ఏదో రాసుకుంటున్నాను
నా లోపల ఎవరో చప్పున ఇటునుంచి అటువైపు వెళ్ళిపోతూ
ఆనవాలుగా వదలుతారు యిరవై యేళ్ళనాటి జ్ఞాపకాల్ని
నా గది అవతల ఎవరో నవ్వుని నొక్కిపట్టిన ధ్వని నీళ్ళని కలచినట్టు
రోదసిలో చీకటిలో అంతర్హిత సంగీతం తాలూకు శ్రుతి చుట్టుకొన్నట్టు
మంచూ మసక వెన్నెలా కలిసిన శీతాకాలపు రాత్రి గుండెలమీద
మరకలా పడుతుంది నా నిట్టూర్పు ఏకాంతంమీద నా తీర్పు
ఎందుకు రాస్తున్నావంటే ఏం చెప్పను ఎవరికి చెప్పనిప్పుడు
గోడమీద బల్లి విసుగ్గా వెళ్ళిపోయింది ఫెరన్ మొక్క నిద్రపోయింది
ఆకాశం నక్షత్రాల్ని జారవిడిచి అంత ఎత్తుకు ఎగిరిపోయింది
నా చుట్టూవున్న తెరలు జారిపోయాయి నాకు నిజంగా మెలకువ వచ్చింది
కిటికీలోంచి శిశిరర్త క్షీణ చంద్రరేఖ గిలగిల్లాడినట్టు కనిపించింది
* * *
---1965



