Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
అయితే డీలక్స్ హోటల్లో, మూడో అంతస్తులో, పదమూడో నంబరుగదిలో
అలా మాట్లాడుతూ చనిపోవడం సభ్యతకాదన్న విషయం నిర్వివాదాంశం
స్వామి విధేయుడైన గుమాస్తా కోటేశ్వరరావు ఆఫీసు పనిమీద వెళ్ళివుంటే
సాంతంగా పనిఅయేలోపున చనిపోవడం డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ అనొచ్చు
మూడంతస్తుల వరకూ వున్న మేడ మెట్లెక్కడం వలన
(లిఫ్టు అంటే అతనికి భయం, ఎప్పుడూ దాన్ని కోరలేదు ఉద్యోగంలో)
విధేయుడైన అతని విధేయపు గుండెలు
ఎదురుతిరిగి శఠించడంవల్ల అనొచ్చును.
ఏమైనా కోటేశ్వరరావు చనిపోవడం నిజం
డాక్టరు తీర్పుకన్న మేనేజరురాగానే లేచి నుంచోకపోవడమే ఇందుకు
నిదర్శనం
ఇతని తాలూకు వివరాలేమీ ప్రమాదకరంగా లేవు
ఇతని తండ్రి గుమస్తా, తాత గుమస్తా, ముత్తాత గుమస్తా
సాంప్రదాయకమైన వినయ విధేయతలకీ, గౌరవప్రదమైన దరిద్రానికీ
వీళ్ళ వంశం ఒక రాస్తా
ఇతనికి యింట్లో ఆరుగురు పిల్లలూ, ఒక ముసలి తల్లీ, బక్క పిల్లీ
ఒకర్తె నీరసంగా వున్న భార్య
ఇతనద్దెకున్న వాటాలో రెండున్నర గదులూ, ఒక టెలివిజన్ లాంటి
బాత్ రూమూ ఒక అటకా
ఇతను ఎర్రచొక్కాలు ధరిస్తాడు, కాని కమ్యూనిస్టు కాడు
ఇతను సందుల్లోంచి నడుస్తాడు, కాని సర్రియలిస్టు కాడు
నడుస్తూ నడుస్తూ నవ్వుతాడు, గొణుక్కుంటాడు, కాని యోగి కాడు
అలా ఆకాశం కేసి వెర్రిగా చూస్తాడు, కాని అసలు కవేకాడు
ప్రతినెలా పాలబాకీ, కిరాణాకొట్టుబాకీ అణాపైసలతో యిచ్చేస్తాడు
అందుకని అఖరివారంలో భార్యతోకలసి రాత్రుళ్ళు పస్తుంటాడు
వీ.డీ.లు ఎందుకొస్తాయో తెలియదు, అఖరుకి
బీడీలు కాల్చడమైనా ఎరుగడు.
ఏడాదికో సినిమాకివెళ్ళి క్యూలో అఖర్న బుద్ధిగా నిలబడతాడు
రాజకీయ సాహిత్య సాంఘిక సంస్థలలో దేనికీ సభ్యుడుకాడు
ఎన్నికలలో వోటు పై ఆఫీస రెవరికిమ్మంటే వారికిస్తాడు
ప్రతి శనివారం దేవుడు పటాన్ని పూజిస్తాడు, పటికబెల్లం ప్రసాదం
తింటాడు



