Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
కవిత కొత్త అనుభవాల కాంతిపేటికను తెరవాలి, కదిలించాలి
ప్రతి మాటకీ శక్తి వుంది, పదును వుంది
ప్రతి చిత్రణకీ అర్ధం వుంది, ఔచిత్యం వుంది
గులకరాళ్ళ డబ్బా మోగించి గొప్ప సంగీతం అని దబాయించకు
అలిగి నన్ను శపించకు, అన్నా; నీమీద నాకు కోపంలేదు
గంతలు కట్టినంత మాత్రాన గాడిద గుర్రంకాదు
ఖద్దరు ధరించిన ప్రతివాడూ గాంధేయుడు కాడు
ఆధునిక వున్నంతమాత్రాన ప్రతిదీ శిరోధార్యం కాదు
ఆహార్యం మార్చినంత మాత్రాన సామాన్యుడు మహారాజవడు
అంత్యప్రాసలు వేసినంతమాత్రాన ప్రొసైక్ భావం పొయెట్రీ అవదు
కవిత్వం ఒక ఆర్కెమీ, దాని రహస్యం కవికే తెలుసును
కాళిదాసుకు తెలుసు, పెద్దన్నకి తెలుసు
కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి తెలుసు
ఈ కాలంలో బ్రతుకు, యీ ప్రపంచాన్ని ప్రతిఫలించు
ఇంటికున్న కిటికీలన్నీ తెరచి అన్ని పవనాల్నీ ఆహ్వానించు
నువ్వు చెప్పేదేదైనా నీదై వుండాలి, నీలోంచి రావాలి - చించుకుని రావాలి
మాటలు పేర్చడం కవితకాదు, మంత్రం తంత్రం అసలేకాదు
మళ్ళీ యీనాడు చిత్రకవితల్నీ, అయోమయబంధాల్నీ పునరుద్ధరించకు
నిగ్రహ ప్రగ్రహాలులేని భావాశ్వాలని బరిమీద వదలకు
అన్నా! కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం చెయ్యాలి
విస్తరించాలి చైతన్య పరిధి
అగ్ని జల్లినా, అమృతం కురిసినా
అందం, ఆనందం దాని పరమావధి
* * *
---1964
సి.ఐ.డి. రిపోర్టు
అయినాపురం కోటేశ్వరరావు
అకాలంలో కాలధర్మం చెందడంలో
అంత రహస్యంగాని, కుట్రగాని, శత్రుప్రయోగం గాని లేవని
రూఢిగా తెలియవస్తోంది పరిశోధనల ఫలితంగా



