Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
ఇప్పటికీ దిగులు నీరు నిండిన
కోటి మనస్సరస్తీరాల నా కవిత
కోరికల కోణాకారపు కొత్త చెట్లని నాటుతుంది
ఇప్పటికీ ఈ చీకటి మొగలో
నిలిచి పాడుతున్న నా కోసం
కుబుసం విప్పిన గోధుమవన్నె తాచు
మొగలి పొదలనుండి పడగవిప్పి ఆడుతుంది
ప్రాగ్దిశా సుందరి ఖండచంద్ర పరిదీపిత కపోలాల హసిస్తుంది
నా గుండెలపై శుక్రతార కిరణం సూటిగా వచ్చి వాలుతుంది
* * *
---1964
నవత - కవిత
మిత్రమా
కవిత వున్నప్పుడే నవత రాణిస్తుంది
అసలు కవితలోనే నవతకూడా వుంది
కాని, మోడరన్ గా వుందామనీ, ఏదో అందామనీ
తనకే తెలియని అస్పష్టపు అనుభూతిని
అర్ధంలేని ఇమేజరీతో కలగాపులగపు వర్ణనలతో
డిలాస్ థామస్ కు చేతగాని అనుకరణలతో
ఒక దేశం నిర్దేశంలేని వాక్యాల వికారంతో
ఎందుకు బాధిస్తావు నన్ను, బాధపడతావు నువ్వు!
"రాత్రి రెండో జాములో రెండు కత్తుల్ని తిన్నాను
గుండెమీద, గుండుమీద సల్ఫ్యురిక్ యాసిడ్ పోసుకున్నాను
నా పెదవుల్ని కత్తిరించి నీ వీపుమీద అతికాను
ఈ నిముషంతో విషంలో నా నేత్రాలు సువర్ణ ఝషాలు"
ఇలా రాయడం కొత్తగా, గమ్మత్తుగా వుంటుంది కాని, ఇది నాన్సెన్స్
ఇది పసితనం ప్లస్ వెర్రితనం యింటూ డికడెన్స్
ఈ కషాయం వికటిస్తుంది,
ఈ వ్యవసాయం వెర్రితలలు వేస్తుంది
కవిత్వంలో అద్స్ క్యూరిటీ కొన్ని సందర్భాలలో వుండొచ్చును,
కాని, పాఠకుడికి నీ అనుభూతి ఆకారం అందాలి హత్తుకోవాలి.
అది ట్రాన్స్ పరెంట్ చీకటై వుండాలి, నిన్ను పలకరించాలి.



