Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
అన్నా
నే పుట్టినప్పుడు
ఏ పిచ్చి పొగడ పువ్వుల గాలి సోకిందో
ఏ పండువెన్నెల మత్తు కమ్మిందో
ఏ పికిలిపిట్ట కిటికీలోకి వ్రాలి నాకేసి చూసి నవ్విందో
ఇలాగ ఇంద్రధనస్సుల్ని అదృశ్య స్వర్గాల్ని అశ్రుత గాంధర్వాన్ని
అన్వేషించుకుంటూ
మామూలు దారుల్నీ మర్యాదల్నీ మంచిచెడ్డల్నీ విడిచి
రాత్రిందివా మధ్య రహః కిర్మీర రథ్య పడిపోతున్నాను
ఆశతో విశ్వాసంతో ఆత్మబలంతో
కాని ఎన్నెన్ని అఖాతాలు అడ్డంకులు
ఎన్ని వేదనావాదనాయుతమైన విశ్వాసాలు
ఈ గుండెలో ఎన్ని గాయాలు
అన్నా
నేనొక జ్వాలా వలయితుణ్ణి దుఃఖితుణ్ణి
నా లోపల నా బాధలు
నా వెలుపల క్షతజగత్తు ఆక్రోశించిన కరుణా బీభత్సరవాలు
నిరంతర పరిణామ పరిణాహ జగత్కటాహంలో
సలసలకాగే మానవాశ్రుజలాలు
అయినా
అంతర్గత సంగీతం అనుపమ సుందరగీతం
నాలోపల వినబడుతూ నన్నిలాగ నడిపిస్తూ
సృష్టిలోని అర్ధంకోసం జన్మలోని సాఫల్యంకోసం
జననమరణాతీతమైన సురభిళ రహస్యం కోసం
ఎన్ని ఎడారిదారుల
కంటకిత కానన మార్గాల
పడుతూ లేస్తూ
పడుతూ లేస్తూ
ఒక్కొక్క తీగ తెగుతూ
మిగిలిన యీ విచిత్ర విపంచికను మీటుకుంటూ
ప్రతి గడపముందు ప్రతి గవాక్షంముందు
నిలబడి పాడుతున్నాను పిలుస్తున్నాను
ప్రతి తెరనీ తొలగిస్తున్నాను
ప్రతి అరనీ తెరుస్తున్నాను
అన్నా
నన్నింకా గుర్తుపట్టలేక పోతున్నావు
అన్నీ పోగొట్టుకున్నా నాలో ఆనందం తరగలేదు
ఆకాశమంత నా ఏకాంతంలో
అనంత మానవ హృదయ స్పందనం వినడం మానలేదు
అలసిన నా ప్రవాసంలో
అద్భుత సౌధాల మణి కవాటాలు తెరుచుకోవటం మానలేదు
మీ వాణ్ణి మీ అందరి మధ్యా బతుకుతున్న వాణ్ణి
అయినా నిలువెత్తు తెరవెనక నిలచిన నేపధ్యగాయకుణ్ణి
ఇప్పటికీ మధుమాసంలో
సహకార తరువుల కింద పవ్వళించిన వేళ
నా గళాన సౌందర్య మధూళి చిందుతుంది



