Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
ఇంకా అలాగే ఉన్నాను
రేగిన జుట్టుతో, నలిగిన షరాయితో
కలలరంగు దుమ్ముపడిన కళ్ళమంటలతో
ఇంక అలాగే తిరుగుతున్నాను
నీహార ప్రతిసీరల మధ్య
నీరవ నదీ తీరాలవద్ద
నిరస్తపత్ర తరుశాఖల క్రింద
ఇలాగే తిరుగుతూ తిరుగుతూ
ఒకే ఒక తీగ మాత్రం మిగిలిన ఈ సితారని మోసుకుని
ఈ నిశాముఖాన నిలిచి పాడుకొంటున్నాను
ఎవరూ వినని పాటని
ఇలాగే నడుస్తున్నాను
ఎవరూ నడవని బాటని
అన్నా
నువ్వన్నీ అమరిని అదృష్టశాలివి
ఇల్లూ వాకిలీ డబ్బూ హోదా పేరూ ప్రతిష్ఠా
వెండిమెట్ల నిచ్చెన లెక్కుతున్న వేళ
నేనొక రావిచెట్టు నీడలో
కొమ్మమీద అహారం దొరకని కృకలాసం కంగారు చూపులో
ఊరవతల సందులలో
దుమ్ముకొట్టుకుపోయిన పిల్లల కళ్ళలో ఆరిపోతున్న వెలుగులో
కాలవ ఒడ్డున వంకర తిరిగిన తుమ్మచెట్టు కొమ్మలోంచి
కాలి మసైపోతూన్న పశ్చిమదిశా గగనంలో
ఒక భయంకర సృష్టిక్రమాన్ని మానవయత్న వైఫల్యాన్ని
ఊహించుకుని ఒణికిపోయేవాణ్ణి
మంచుబొట్లు రాలిపడే
మసక మసక నేకువ పోక చెట్లకింద
కన్నీటితో వెతికేవాణ్ణి
నన్ను కికురించిన కలకోసం
నా కోర్కెల వెలుగుల వజ్రం కోసం
అర్ధరాత్రివేళ
ఊరి పొలిమేరలో తోటలో
రాలిపడిన నక్షత్రాన్ని నిర్జరీ సురుచిర స్వప్నాన్ని
ఏరుకుని జేబులో దాచుకుందామని
ఎంత ప్రయత్నించేవాణ్ణి
అపుడు నా వీపుమీద తారల తళుకు
నా నొసటమీద క్రొన్నెలవంక కులుకు
నన్ను చూసి వీడు పిచ్చివాడనీ మాంత్రికుడనీ
అవహేళన చేశారందరూ



