Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
ప్రవహ్లిక
ఏ నిశ్శబ్ద ప్రపంచాల మధ్య
ఏమిటి నీ కళ్ళు మాట్లాడుతున్నాయి
ఉత్తర ధ్రువంలో మంచువంటి తెల్లని
హృదయం గలదానా ఆడదానా
ఎన్ని పూర్వజన్మల స్మృతుల జాడలు
ఈ క్షణంలో నీ కనురెప్పల నీలినీడలు
నక్షత్రాల మధ్య ఆకాశంవంటి
నల్లని కళ్ళదానా ఓ ఆడదానా
సృష్టి ముందటి చీకటిలోంచి ఏరుకున్నా
సౌందర్యాన్ని నీ కళ్ళల్లో నింపుకున్నావు
సృష్టి చివరి లయంలోని శూన్యాన్ని నన్ను
స్పష్టమవని కామంలో బంధించుకున్నావు
చీకటివంటి నీ విచిత్ర వీక్షణాకర్షణకి
సంధ్యాగగనం మీద ఎర్రని ఆందోళనని నేను
క్షితిజరేఖలా వంగిన నీ భుజాల వొంపు దగ్గర
చెదరి విరిగిన సముద్రపు కెరటాన్ని నేను
ఆడదానా అద్భుతమైనదానా నిక్వణత్ వీణా
అర్ధంలేని నన్ను చుట్టుకున్న పరమార్ధానివి నువ్వు
దట్టమైన అడవులలోని నిగూఢ రహస్యాలు
దాచుకున్న కన్నులు కలదానా ఆడదానా
స్వర్గనరకాల సరిహద్దుల మధ్య నిలిచి నీవు
సమ్మోహ మంత్రం జపించే శృంగారవధీ విధీ
నాకు తల్లివి నెచ్చెలివి చెలివి
నన్ను కౌగిలించుకున్న పెద్దపులివి
* * *
---1964
అదృష్టాధ్వగమనం
అన్నా
నన్నాలవాలు పట్టగలవా?
ఆనాటివాణ్ణి, నీ చెలికాణ్ణి
అవునులే కాలమొక్కటే కాదు మన మధ్య దూరం
లౌకిక జగత్తు కల్పించిన వ్యత్యాసాల విశ్వాసాల పూర్వార్ధగోళంలో
ప్రయోజన విజయ పరంపరల పాలరాతి మేడమీద చిటారుగదిలో నువ్వు
నేనో మరి ఇంకా సమాజంలో
స్థూలమైన ఆకృతిని అస్తిత్వాన్ని పొందని పొందలేని ఊహామరుత్తుని,ఏకాకిని



