Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
సమ్యక్సిద్ధాంత రధ్యమీద రథాన్ని నడిపిస్తాడు
చరనౌడ్య క్రూరమృగాల సంకులారణ్యంలో
సహేతుక సాహసం కవచంగా ధరించిన అఖేటకుడు
చలజ్జీవన దైనందిన కోలాహల పాంసుపరాగంలో
తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు
అల వివేకానంద రవీంద్ర మహాత్ముల త్రివిధ పథగామి
ఆనిదంపూర్వ వసుధైక కౌటింబికుడు మహానాయకుడు
* * *
ప్రిన్స్ ఛార్మింగ్ డార్లింగ్ ఆఫ్ ది విలియన్స్ వెళ్ళిపోతున్నాడు
దారినివ్వండి
స్వప్న శారిక అతని శిరస్సుచుట్టూ పరిభ్రమిస్తున్నాయి
మనవాడు జవహరుడు భారతభూషణుడు కదలిపోతున్నాడు
కన్నీరు విడువకండి
కోటికోటి ఎదల గులాబీలు అతని పాదాలు ముద్దిడుతున్నాయి.
ప్రియదర్శనుడు నెహ్రూపండితుడు శాశ్వత నిద్రపోతున్నాడు
సద్దు చేయకండి
విధుర వసుమతి మౌన విషాదగీత మాలపిస్తున్నది.
* * *
--- 1964
వానలో నీతో
ఆకాశాన్ని మేఘం నల్లని కంబళిలా కప్పుకుంది
ఆనందం మనసులో మయూరబర్హంలా విప్పుకుంది
ఆలోచనలెందుకు జవ్వనీ! విలోకించు వర్షాసంధ్యని
సందేహం వదలి నా సందిటిని నిలిచి కళ్ళత్తి చూడు
అరటితోట నడుంచుట్టి కాలువ ఏటవాలుగా మలుపు తిరిగింది
నారికేశ వనాంతాన ప్లాటినం సంకేతంలా మెరుపు మెరిసింది
నీ వొంటి మీద చిరుగంధ సువాసన నా మనస్సుని చుట్టుకుంది
నిర్ణిద్ర కాంక్షారమ్యమై, నీపమై నా జీవితం విరిసింది.
చినుకుల కలనేత వస్త్రాన్ని సింగారించుకుంది ధరిత్రి
సిందువారం పులకరించి చిరుసిగ్గు పూలని పూసింది
ఆకుపచ్చని ఉత్సాహంతో విజృంభించింది ప్రాణశక్తి
ఆనందవల్లరీ! ప్రేయసీ! అందించు నీ అధరామృత సూక్తి
వానలో, కానలో నాకు అవిరామ ప్రాచీనత స్ఫురిస్తుంది
వార్షుకాభ్రం నాకు యక్షపతీ సౌందర్యాన్నీ రచిస్తుంది
బాబిలోనియన్, ఈజిప్టు నాగరికతా స్తూపాలలో నీడలలో
ప్రాణప్రియా! మనమిరువరం మధువు సేవించినట్టు గుర్తుకొస్తుంది.
* * *
---1964



