Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
ఈ హఠాత్పరిణామంలో
ఎంత అర్ధవిహీనమైపోయింది సర్వం
ఎంతగా కుంగి 'కో' యని విలపించింది నా హృదయం
ఎవరు చెప్పు యింతటి దాకా
ఈ భూవలయం మీద ఇంత హుందాగా ఇంత అందంగా
ఇంత గర్వంగా తిరిగిన మనిషి
ఎవరు చెప్పు ఈ విశాల గగనం మీద
ఈ దిక్కునుండి ఆ దిక్కుకు యింత అర్ధవంతంగా
ఆగామి మానవ సంతతికి ఆదేశంగా ఆదర్శంగా
స్వర్ణాక్షర సంకేతాన్ని రచించిన మనిషీ
ఎవరు చెప్పు యీ ప్రపంచ చరిత్ర తలుపు తట్టి
లోపలి చీకటిలో గదిగదిలో మూల్గులు వినవచ్చే ఎదఎదలో
ఆశా కర్పూర దీపాన్ని వెలిగించిన నవీన రాజర్షి!
జ వ హ ర్
నలభై ఐదుకోట్ల జనుల ప్రియతమ నాయకుడా
నీవులేవనే తలపు రానివ్వలేక పోతున్నాను
నిద్ధమైన ఈ నిలువుటద్దం మీద పగులు చూడలేక పోతున్నాను
ఈ దేశంలో ఏ హృదయద్వారం తెరిచినా
సాలోచనగా జాలిగా గంభీరంగా నిలబడే నువ్వు
ఈ దేశంలో ఏ దారి మలుపు తిరిగినా
అక్కడ నీ పదాంకం నువ్వు కట్టిన యిల్లు ధైర్యంగొలిపే నీ చిరునవ్వు
ఎలాగ నీ స్మృతినుండి పారిపోగలను
ఈ దుఃఖాన్ని మరిచిపోగలను
మానవోత్తముడవు
మేరునగ ధీరుడవు
అకుంఠిత కార్యదీక్షాదీక్షితుడవు
అపుడే ఎలాగ విడిచిపోయావయ్యా
అసంపూర్ణ చిత్రాన్ని వదలి
అనిబద్ధమాలికను వదలి
ఎలాగ కనుగిలికి తెర తొలగించి నిశ్శబ్దంగా నిష్క్రమించావు
దిగ్భ్రాంతమైన దేశాన్ని విడిచి
దీన మానవాళిని మరచి
* * *
ఆ తోటలో పువ్వులెప్పుడూ పూస్తాయి
అక్కడ నిత్య వసంతం
గడచిన శిశిరాన్ని తలచుకొని
గజగజ వణక దాచెట్టు
అతడు నిత్య యౌవనుడు
వర్తమానం పదునైన కత్తి
దానినొత్తి చీకటి మొదళ్ళు కోస్తాడు
భూతకాలం నూనెలో తడిపిన వత్తి
దాన్ని మెదిపి భవిష్యదీపాన్ని వెలిగిస్తాడు
చారిత్రక దృక్పధం అతని శక్తి



