Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
తురుముకుందా మనుకున్న నా భార్య
నఖక్షతాలైన ఎరక్క రాత్రిళ్ళు
మేల్కొన్న నిట్టూర్పుల గాధలు
ఔనౌను పోగొట్టుకున్న వజ్రంకోసం
ఎక్కడని వెదుకుతావు
ఏ నేల పగుళ్ళలో ఏ గుండె లోయలలో
ఏ కారడవులలో ఎందుకో బెంగ నీలో నాలో
దేనికోసమో తెలీని అన్వేషణ
అదృశ్య జీవితశాఖలపైన పువ్వు లవలేని మొగ్గల సంభాషణ
అయినా నడుస్తున్నాను
దట్టమయిన మంచుపడిన చీకట్లో అలాగే వెతుక్కుంటున్నాను
నన్ను నేను నాలో నీలో గతంలో
మనని మనం పోగొట్టుకున్న దినం మహాలయ అమవాస్య
ప్రతి ఉగాదికీ మెరుస్తూ పిలుస్తుంది ఆశావేశ్య.
* * *
---1964
నెహ్రూ
ఈ వేళ పువ్వులన్నీ వాడిపోయిన రోజు
ఏకాంతంలో భూమి ధ్రువగళాలెత్తి ఏడ్చిన రోజు
తెల్లని పావురం ఎండలో సొమ్మసిలిపోయింది
తల్లి లేని పిల్లల్ని నీడలోకి పిలిచేవాళ్ళు లేరు
సముద్రమధ్యంలో ఓడలో దిక్సూచి పనిచెయ్యడం లేదు
సర్వజనావళికి యాత్రాపధంలో సైన్ పోస్ట్ కూలిపోయింది
చరిత్ర మిట్టమధ్యాహ్నంలో చలివేందిర కనబడటం లేదు
నాగరికత నగరం మధ్య నడిరోడ్డుమీద మూర్ఛపోయింది
అన్ని విధాలా చెడ్డరోజని అన్ని పంచాంగాలూ ఒప్పుకున్నాయి
స్విన్ననయనం ఛిన్న హృదయం నేటి చిహ్నంగా నిలిచిపోయాయి
అయిదు ఖండాల జిజ్ఞాసువులు ఆలోచనాంధకారంలో చిక్కుకున్నారు
అఖండ కాలనీల కూలంకష పొంగి అందమైన పట్టణాన్ని ముంచివేసింది
ఆకాశ ద్వారంలో అతనికి స్వాగత తోరణం కట్టారు
రణంలో మరణంలో అజేయుడైన యీ వ్యక్తి అమరుడన్నారు
అవనత మస్తకాలతో అశేష ప్రజానీకం అశ్రుతర్పణం చేశారు
అజరామరమైన అతని వాణి తరతరాలు వింటారు కలలు కంటారు
* * *



