Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
కత్తి వాదరకు తెగిన కంఠంలో హఠాత్తుగా
ఆగిపోయిన సంగీతాన్ని వినిపించు
మానవ చరిత్ర పుటలలో నెత్తురొలికి
మాసిపోయిన అక్షరాల్ని వివరించు
రహస్య సృష్టి సానువులనుండి జారిపడే
కాంతి జలపాతాన్ని చూపించు
మమ్మల్ని కనికరించు
చావు పుట్టుకలమధ్య సందేహం లాంటి
జీవితంలో నలువైపులా అంధకారం
మంచి గంధం లాగ పరిమళించే మానవత్వం
మాకున్న ఒకే ఒక అలంకారం
మజిలీ మజిలీకి అలసిపోతున్నాం
మలుపు మలుపుకీ రాలిపోతున్నాం
ఆశల వెచ్చని పాన్పుమీద స్వప్నాల పుష్పాలు జల్లుకుని
ఆదమరచి కాసేపు విశ్రమించటాని కనుమతించు తండ్రీ!
* * *
---1963
యుద్ధంలో రేవుపట్టణం
సముద్రంలో చీకటిలో ఓడలు
నగరంలో చీకటిలో నీడలు
రాత్రి గుండెమీద లేచిన మంటలు
సముద్రంలో ఎర్రని మంటల మాటలు
ఓడల్లో మేల్కొన్న మనుష్యులు
మనుష్యుల ముఖాలమీద ఏసిడ్ మచ్చలు
తీరానికీ తీరానికీ మధ్య హడ్ వైర్లెస్ వార్తలు
మనుష్యుల జేబుల్లో భయాల బొద్దింకల పరుగులు
యెల్లో గ్రీన్ గ్రీన్ రెడ్ డేంజర్
సైరన్ కూతలు
ఫిరంగి మోతలు
ట్రెంచెస్ లో నొక్కిపట్టిన ఉలిపిరి ఊపిరి
చీకటిలో వ్యాపించిన మృత్యువు కావిరి
నగరం టవరుమీద ఎక్కి ఎర్రగా చూస్తోంది
నగరం భయంతో గుండె బరువెక్కి నల్లగా చస్తోంది
లైట్ హౌస్ రాక్షసి తలచుట్టూ ఒకే కన్ను తిరుగుతోంది
నగరంలో నరాలమీద తుపాకీల వరసలు
గగనంలో విమానాల విరిసిన తెల్లని రెక్కలు
రెక్కలమధ్య ఆకాశం ఎర్రని ఎరుపు



