Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
ఆమె ఆరోజు కూడా కొడుకుతో పార్కుకి వచ్చింది
అలాగే తెల్లచీర కట్టుకుందిగాని ఎర్రని బొట్టులేదు
నల్లని వాల్జడలో తెల్లని సన్నజాజులు లేవు, చేతులకు గాజులు లేవు
ఆమె సోగకన్నులలో వానకురిసి వెలిసిన ఆకాశం స్ఫురించింది
ఆమె చీటికీ మాటికీ అదిరే పెదవిని ముని పంటితో నొక్కుతోంది
అక్కడ చేరిన గుంపులు 'జైహింద్' అన్న నినాదం చేశారు
'అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళాడు - ఇంకా రాడేం?'
అని అడుగుతూన్న కుమారుణ్ణి అక్కున చేర్చుకుని
ఆమె కూడా రుద్ధకంఠంతో 'జైహింద్' అని మెల్లగా పలికింది
ఆ మాట స్వర్గంలో ఒక వీరునికి హయిగా తీయగా వినపడింది.
* * *
---1965
ప్రార్ధన
దేవుడా
రక్షించు నా దేశాన్ని
పవిత్రులనుండి పతివ్రతలనుండి
పెద్దమనుషులనుండి పెద్దపులులనుండి
నీతులు రెండు నాల్కలు సాచి బుసలుకొట్టే
నిర్హేతుక కృపా సర్పాలనుండి
లక్షలాది దేవుళ్ళు నుండి వారి పూజారులనుండి
వారివారి ప్రతినిధులనుండి
సిద్ధాంత కేసరులనుండి సిద్ధులనుండి
శ్రీ మన్మద్గురు పరంపరనుండి
దేవుడా
నలభైకోట్ల మనుష్యుల నిజమైన ప్రాణంవున్న
మనుష్యులతో నిండిన దేశం నాది
ఆకలీ బాధలూ ఆందోళనలూ సమస్యలూ
విరివిగావున్న విచిత్రసౌధం మాది
కడుపు నిండుగా ఆహారం గుండె నిండుగా ఆశ్లేషం
బ్రతుకు పొడుగునా స్వతంత్రం
కొంచెం పుణ్యం కించిత్ పాపం
కాస్త కన్నీరూ మరికాస్త సంతోషపు తేనీరూ
చాలు మాకు తండ్రీ
సరదాగా నిజాయితీగా జాలి జాలిగా
హాయి హాయిగా బ్రతుకుతాం
మాకు నటనలు వద్దు మా చుట్టూ కటకటాలు వద్దు
గొప్పలూ గోసాయి చిట్కాలు వద్దు
దేవుడా!



