Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
చుక్కలమధ్య ఆకాశం చితికిన కురుపు
నగరంలో గదిలో పొలిటీషియన్సు మనస్సులలో పిచ్చిగీతలు
సముద్రం ఎదలోంచి ఏవేవో కూతలు
ఆకాశం మీద పేలిన కాలిన విమానాలు
సముద్రంలో అంటుకున్న మునుగుతున్న ఓడలు
అంటుకున్న ఓడలోంచి అరుపులు
ఇళ్ళల్లో సన్నని ఏడ్పులు
గ్రీన్ గ్రీన్ యెల్లో యెల్లో సైరన్ మోగిన అభయం
నగరంలో చీకట్లో ఒక్కసారిగా నల్లని చల్లని నిశ్శబ్దం
చటుక్కున నగరం చేతులెత్తి గుండెలు బాదుకుంది
సముద్రంలో మొసళ్ళు కంగారుపడి శవాల్ని మింగేశాయి.
* * *
---1964
నీడలు
చిన్నమ్మా
వీళ్ళమీద కోపగించకు
వీళ్ళ నసహ్యించుకోకు
నిన్నెన్నెన్నాఅన్నారు అవమానాల పాల్చేశారు
అవినీతి అంటగట్టారు
ఆడదానికి సాహసం పనికిరాదన్నారు
చిన్నమ్మా
వీళ్ళందరూ భయపడిపోయిన మనుష్యులు
రేపటిని గురించి భయం సంఘ భయం
అజ్ఞాతంగా తమలో దాగిన తమనుచూసి భయం
గతంలో కూరుకుపోయిన మనుష్యులు
గతించిన కాలపు నీడలు
చిన్నమ్మా
వీళ్ళందరూ తోకలు తెగిన ఎలుకలు
కలుగుల్లోంచి బయటికి రాలేరు
లోపల్లోపలే తిరుగుతారు
మౌఢ్యంవల్ల బలాఢ్యులు
అవివేకంవల్ల అవినాశులు
వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు
సంఘపు కట్టుబాట్లకి రక్షకభటులు
శ్రీమంతుల స్వేచ్ఛావర్తనకి నైతిక భాష్యకారులు
శిధిలాలయాలకు పూజారులు



