Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
బిగపట్టిన నగరాల నరాలమీద ఏవో వార్తల గుసగుసలు
బిగించిన పిడికిళ్ళ సందులనుండి జారిన నెత్తుటి ప్రతిజ్ఞలు
ఒకే పూవు ఒకే తూగు ఒకే దీక్ష - జాలి మేల్కొన్న గుర్తులు
ఒక దేశం తన దారిన తాను పోతూవుంటే
ఊరుకోదు ఇరవయ్యో శతాబ్దపు నాగరికత
పొరుగువాడి మంచితనం దుష్టుడి దురహంకారాన్ని రెచ్చగొడుతుంది
పక్కవాడి సౌభాగ్యం బాలిశుడి గుండెల్లో మంటల్ని రేపుతుంది
ఆసియారంగం మీద నియంతలవతరించిన దుర్ముహుర్తాలివి
చరిత్రకు సిగ్గుచేటు
ప్రజల నోళ్ళుకొట్టి ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి
గజదొంగ లీనాడు రాజులై రారాజులై ఏలుతున్నారు
అందుకే భారతం పొడ వారికి కిట్టదు. రాజకీయ ద్యూతంలో
లాభం ముట్టదు
మెత్తగావుంటే పిల్లి అన్నారు
తిరగబడి మొత్తితే బెబ్బులి అన్నారు
అవకాశవాదులు నోరుతెరిస్తే దుర్వాసన
నీతిని విడిచిపెడితే రాజనీతి అవుతుంది
జాతికి మతావేశం పొదిగితే కోతి అవుతుంది
పాకిస్తాన్ చైనాల పరస్పర మైత్రి
పామూ తోడేలూ కలిసినట్టు
ఇది రెండు దేశాలమధ్య యుద్ధమే కాదు
ఇది కాస్త భూమికై కయ్యమే కాదు
ప్రపంచ భవితవ్యానికి ప్రధానమైన విలువల్ని కాపాడే ప్రయత్నం యిది
భావనా స్వాతంత్ర్యం వ్యక్తి గౌరవం
వర్ణ వర్గ మతభేద రాహిత్యం దీనికి పునాది
ప్రతి భారతీయుడూ ఒక సోల్జర్ ప్రతి హృదయం ఒక శతఘ్ని
రేడియోలో వార్తలు రోజూ వస్తున్నాయి
విజయ పరంపరను అందిస్తున్నాయి
శత్రువుల టాంకులు విమానాలు ఎన్నో ఎన్నో కూలిపోయాయి
సాహసోపేతమైన భారతీయ సైన్యతరంగం
లాహోర్ సరిహద్దుల మీద విరుచుకు పడింది.
నిర్ణిద్రహర్యక్షమై జాతి నిలబడి గర్జించింది
కీలర్, అబ్దుల్ హమీద్, హవల్దార్ పోతరాజు
ఇంకా లక్షలాది అజ్ఞాత సైనికుల కాబాలగోపాలం
కృతజ్ఞతాంజలి సమర్పించింది



