Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
అవధరించవెందుకు పరిపక్వమైన నా యౌవన విన్నపాన్ని
నవధరించవెందుకు అసకృదతిశయోక్తికి శీలమైన నా తనూకావ్యాన్ని
జాగు సేయకు ప్రభూ - కడ
జామువచ్చెనా తన వెలుగు పారెనా - నిష్ఫలమివన్నీ
సేవంతికా సురభిళ శ్రీమంత మీ నిశాంతమ్ము నన్ను వేగించును
హేమంత సమీర పోత మేమింతగా క్రొవ్వి నన్నలయించును
ఎందుకింత నిర్దయ ప్రభూ
ఏకాంత కుంత నిహతమ్ము రసైకమద్భావనా శకుంతమ్ము
* * *
---1963
అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు?
అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్ళాడు? ఇంకా రాడేం?
అని అడిగాడు నాలుగేళ్ళ పిల్లవాడు మరోసారి---
అలవోకగా వాడి తల నిమురుతూ ఆమె అలాగే
ఆశతో వింటోంది రేడియోలో వార్తలు---
ఆమె కళ్ళల్లో విమానాల రెక్కలు కదలిన నీడలు
ఆమె గుండెల్లో మరఫిరంగులు పేలిన జాడలు
కాశ్మీరు సరిహద్దులో కమ్ముకొన్న నల్లని పొగలమధ్య
కాలూని నిల్చున్న సైనికుడు చటుక్కున
ఆమె కళ్ళముందు నిలిచాడు
ఆమె కళవళపడింది - నిట్టూర్చింది - పయిట సరిచేసుకుంది
అంతలో మృదుగర్వరేఖ ఆమె పెదాల చిరునవ్వుతో కలిసిపోయింది
పార్కు బెంచీమీదనుండి లేచి పిల్లవాడికి చేయూతనిచ్చి
మెల్లగా నడుస్తూ మునిమాపు చీకట్లలో కలిసిపోయింది.
ఆమె రోజూవస్తుంది పార్కులోకి వార్తలకోసం
అలాగే తెల్లని చీర కట్టుకుని ఎర్రని బొట్టుపెట్టుకుని
నల్లని వాల్జడలో తెల్లని సన్నజాజులు తురుముకొని
అదే పార్కు అదే రోడ్డు అదే బజారు అదే యిల్లు
అయినా ఆమె ఏదో మార్పుని పసికట్టింది
అందరూ తింటున్నారు తిరుగుతున్నారు
అయినా ఎక్కడో డెక్కుపట్టింది.



