Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
ఒక్కసారి
దిక్కుమాలి
కడలిపొంగు కనులతోడ
గడప గడప ముందు నిలిచి
విలపింపకు
వేడుకొనుక
భూకంపము వచ్చి మహా నగరమ్ములు ధరక్రుంగును
భూధరములు రగిలి పగిలి భుగ భుగ లావా పొంగును
ఒక్కసారి
ఓ నెచ్చెలి
విశ్వాస పునర్నవం
వాసంత కలస్వరం
చిక్కబట్టి
చేర రమ్ము
ద్యుమిణి కిరణకాంతి కురిసి ధ్రువసీమల మంచు కరుగు
తొలిరేవున లంగరెత్తి తెలివెల్గుల ఓడ కదలు
* * *
---1963
విరహోత్కంఠిత
నా గది స్వప్నాలతో నిండిపోయింది
నా మది స్వగతాలతో కుంగిపోతుంది
ఇంక రావెందుకు ప్రభూ
శంకాకులమై ఈ రాత్రి సడలిపోతోంది
ఎన్ని సరదాల అగరువత్తులు వెలిగించుకున్నాను
ఎంత కాంక్షా శ్రీగంధమ్ము మైనలదికొన్నాను
సవ్వడైతే చాలు ప్రభూ
రివ్వున స్మరశరం హృదయాన్ని దూసుకుపోతోంది
నా వొంటి నిగనిగలవంటి శయ్యను సజ్జితం చేశాను
నా కంటి మిలమిలల వంటి మధువు పాత్రల నింపాను
త్వరమాణమై ప్రభూ, నా
తనువు స్వీయ యౌవన భారాన తరబడి పోతూన్నది
కిటికీ అవతల హిమస్నాత మాలతీలత నన్ను పలకరింపదు
కిటుకు తెలిసిన పొదలోని గువ్వలజంట నన్నూరడింపదు
కందళించే యీ వలపు ప్రభూ
గాఢాశ్లేష దోహదం లేక కమ్రవికాసితోద్భాసితం కానేకాదు



