Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
ఇదే యిదే
ఇదే యిదే
మానవునికి చివరిరోజు
చరిత్ర యిక లేదు లేదు
మనిషి మేధ మనిషిగుండె విడిపోయిన ఆనవాలు
భస్మీకృత ధాత్రిమీద కశ్చిన్మూర్ఖుని తుదివ్రాలు
విధి హసించు
ఇది ముగింపు
* * *
---1963
ఒక్కసారి
ఒక్కసారి
ఒక్కసారి
ఉద్విగ్న హృదంతరం
ఉన్మత్త ప్రభంజనం
రేగనీకు
సాగనీకు
అడవులలో పెద్దపులులు అర్ధరాత్రి పరుగులెత్తు
నడవలలో పెనుత్రాచులు నాల్కసాచి బుసలుకొట్టు
ఒక్కసారి
ఆశజారి
నిస్పృహలో నీరసించి
నెగడువంటి వేదనలో
తూలిపోకు
కాలిపోకు
దిక్కులలో కార్మొయిళ్ళు దిగులువోలె కమ్ముకొనుచు
చుక్కలలో తళుకుమాసి ఒక్కటొకటి రాలిపడును
ఒక్కసారి
మనసుమారి
కలలబాట విడిచిపెట్టి
వలపు చెలియ తొలగనెట్టి
నడిరాతిరి
పడిపోవకు
చలి తుపాను వీచి వీచి అలరుతోట వాడిపోవు
పొలిమేరల మంటలేచి పూరిగుడిసె కాలిపోవు



