Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
అడిస్ అబాబాలో హెయిలీ సెలాసీ గెడ్డం పొడుగు
చైనాలో చౌ - యన్ - లై అంటే పెద్ద అబద్ధ మడుగు
ప్రజాస్వామ్య దేశాలలో ఖరకాంతలు వ్రీడావతులు
సామ్యవాద రాజ్యాలలో కౌశికులే మతగురువులు
మజాకి పదవీ వ్యామోహం మద్యపానం వృధావృధా
గజానికొక గాంధారి కొడుకు గాంధీగిరి దేశంలో
ఇజంలో యింప్రిజన్ అయితే జ్ఞానం నశిస్తుంది
ప్రిజమ్ లాంటిది జీవితం, వేర్వేరు కోణాలు ప్రదర్శిస్తుంది.
మాధుర్యం కావ్యంలో ఎందుకు! మత్కృతిపతి స్తోత్రంలో వుంటే
చాలంటాడు తెలుగులో కవి
మాలిన్యం మనసులో వున్నా మల్లెపువ్వులా నవ్వగల్గడం
యీనాటి తెలివి
పల్లెటూరి పిల్లకి సినీతార దివా స్వప్నం
పట్నవాసం షోకిల్లాకి హాలీవుడ్ భూతల స్వర్గం
చంద్రగోళం చవిటిపర్రమీద వెతగ్గా వెతగ్గా
ప్రబంధనాయికల ఉపాలంభనలు దొరికినవట
విశ్వనాధవారు వెనక్కి నడవగా నడవగా
వేదకాలం యింకా వెనక్కి వెనక్కి పోయిందట
సౌతాఫ్రికా ప్రధానమంత్రికి సామరస్యం ప్రధాన లక్ష్యం
రష్యానేత కృశ్చేవ్ కీ ప్రపంచ శాంతి ఒకటే గమ్యం
అమెరికన్ కెనడీకి పరోపకారం స్పూన్ తో పెట్టిన ఆహారం
అయినా యుద్ధం ఎందుకంటే తమ్ముడూ! అది మన ప్రారబ్ధం!
ఇకముందే కీన్సే రిపోర్టు పాఠ్యగ్రంధం ప్రతీబడిలో
ఇకముందు స్ట్రిప్ టీజ్ తప్పనిసరి ప్రతివూళ్ళో
విలాసవతుల క్రీగంట చూపు నుండి విద్యుచ్ఛక్తి సరఫరా చేస్తారు
విశాఖపట్టణంలో ఆసుపత్రిని వేదాంత భవనంగా మార్చేస్తారు.



