Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
ప్రపంచంలో ప్రాణికోటిలో
తానే ముఖ్యుడన్న నమ్మకం మానవుడికి
కానీ పాపం వాడికి తెలియదు
కప్పాబల్లీ మురికి కాల్వలో పురుగూ
ఎంత స్వాతిశయంతో ఉంటాయోమరి
ఒక రైలునీ ఒక విమానాన్నీ కనిపెట్టానని
ఉత్సాహంతో ఛాతీ విరుచుకుంటాడు మానవుడు
కానీ మానవజాతినే మారుమాటాడకుండా
మసి చెయ్యగలను మరో నిమిషంలోనని
కలరా బేసిలై - గర్వంగా లోపల్లోపల నవ్వుకుంటుంది
దేవుళ్ళని తన రూపంలో సృష్టించుకుని
తన భయాన్నీ కోర్కెల్నీ వాళ్ళకి తగిలించుకుని
అడిగినప్పుడల్లా వరాలిమ్మని ఒప్పందం చేసుకొని
ఫరవాలేదని ప్రమత్తుడయ్యాడు మానవుడు
ఏవో కొన్ని పరిశోధనలు చేసి భాష్యాలు వ్రాసి
ఇదంతా మిధ్య అనీ లేని నిజం ఎక్కడో దాక్కుందనీ
మిద్యాసృష్టి భాగమైన మేధ ద్వారానే
అన్నీ తెలుసుకోగల ననుకుంటాడు మానవుడు.
* 'మైనస్ యింటూ ప్లస్' గీతిక మరో రూపంలో
న్యూ సిలబస్
అమెరికాలో డాలర్లు పండును
ఇండియాలో సంతానం పండును
భూమి తనచుట్టూ తాను తిరుగుతూ
ధనవంతుడి చుట్టూ తిరుగుతుంది
దరిద్రం సముద్రంలో వేదనల తెరచాపలెత్తి
ప్రయాణించే జీవన నౌకలకి మత్యువే లైట్ హౌస్
ఆశ ఉత్తర ధ్రువం, విధి దక్షిణ ధ్రువం
మనిషి రెండింటిమధ్య బంతిలా ఎగిరపడే ప్రహసనం
వాణిజ్యం ఆజ్యంకింద నాగరికతా క్రతుగుండంలో
అనురాగం, ఆత్మీయతా వేల్చబడే సమిధలు
స్వార్ధం సోమయాజి, లక్ష్యం అధికార రంభా పరిష్వంగం



