Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
సుందరాంగుల జాగ్రఫీలో విద్యార్ధులు నిమ్నోన్నతాలు గుర్తిస్తారు
సువర్ణం కన్న అగ్రవర్ణం లేదని సకల కులాలవారూ అంగీకరిస్తారు
నిర్వేదం వేదంకింద, నిరాహారం నిష్టాగరిష్టతకింద
సశరీర సాయుజ్యం సామాన్యులకి ఉచితంగా కానుక
ఇది మిలయనీర్లూ, మతాధికారులూ వేసే సరికొత్త ఆధ్యాత్మిక ప్రణాళిక
హరనేత్రానల దగ్దుడైనా ఆనంగుడి పొగరు కాస్తయినా అణగలేదని
సర్వోదయ స్వాములందరూ స్మర (సర్ప) మహాయాగంలో
సినిమాపోస్టర్లు, తారల పాతచీరలూ సమిధలుగా ఆహుతి
ఘనాఘునంలా గర్జించింది ఆఫ్రికన్ ఘనా
పంచశీలతో ఊడిపోయిన సీల పేరు చైనా
అణుబాంబు యుగంలో భూతలమొక స్వర్గం మనుష్యులు వినా
మను సంభవం యింక మార్చేసి రాయాలి అల్లసాని పెద్దన్న అయినా
భూమధ్యరేఖ దగ్గరకన్న ఆడదాని భ్రూమధ్యరేఖ దగ్గర వేడి ఎక్కువ
ఎన్నికలలో ఎగరేసిన వాగ్దానపు కత్తులకి మొనకన్నా పిడి దగ్గర
వాడి ఎక్కువ
చచ్చి బ్రతికిన ప్రతివాడూ పాట్రిస్ లుముంబా
బతికినా చచ్చినవాళ్ళు ఒక లెక్కా జమా!
మతం నల్లమందు గతం ముదిమికి విందు
భావి యౌవనులకు భావకులకు బలే పసందు
ఆలోచనల జెట్ విమానాలకి భయపడి
అలవాచు మట్టిరోడ్ల మీద కుంటుతుంది ముసలితనం
పృథ్వ్యాకాశాల మధ్య గాండీవ ధనుష్టంకారంలాగ
మోగుతుంది యౌవనం
నా పాట విప్లవానికీ విశ్వశాంతికీ నాంది అన్నాడొక అధునాతన
సాహసికుడు
నా మాట చీకటికీ శ్లేష కవిత్వానికి శ్లేష్మ జీవితానికి బాట
అన్నాడొక ప్లవంగుడు
ఆగామి ఆశల వర్షాగగనం మీద అదిగో ఆనందం అనే యింద్రధనుస్సు
అలమటించే లోకానికి అండగా నిలుస్తుంది నవకవి వచస్సుధా
సుమనస్సు
* * *
---1962



