Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
అయినా క్వయినాలాంటి జీవితంలోంచి
ఆనంద మధువును పిండాలని ఆలోచించి
కళలూ, కవిత్వాలూ, గాంధర్వం, వేదాంతం
కనిపెడుతూనే వున్నాడు మానవు డాజన్మాంతం
అర్ధరాత్రి చిలీలో, పట్టపగలు యిరాక్ లో భూకంపం
ప్రియురాలి పరిష్వంగంలో సుఖం
పడుకునేముందు పాన్పుకింద పాముందో లేదో చూసుకో
ప్రబల శత్రువెవడో నిన్ను వెన్నంటి వున్నాడు కాసుకో
తాను లేనిదే దేవుడిని తలచేవాడెవడూ లేడంటాడు మానవుడు
తాను లేనిజే మనిషికి ఆలంబన ఏదంటాడు సదరు దేవుడు
ఈ రహస్యం రహస్యంగా వుంచకండి, అందరికీ చెప్పెయ్యండి
దేవుడిని తిరగేస్తే మానవుడు, మానవుణ్ణి తలక్రిందు చేస్తే దానవుడు
దేవుడికి మానవుడికి యెప్పుడూ సరిపడని దాంపత్యం
ఇద్దరికీ విడాకులు ఏ కోర్టూ యివ్వలేదు విచిత్రం
సుదీర్ఘ వలయంలాంటి కాలం చుట్టూ ఒకరినొకరు
అదేపనిగా తరుముకుంటూ తిరుగుతుంటారు
గుండ్రంగా, గుండ్రంగా, గుండ్రంగా.
* * *
---1962
మైనస్ యింటూ ప్లస్
జడంగా వున్న శాంతి నుండి
ఎడంగా తప్పుకుంటాడు మానవుడు
సంచలనం కలిగించే
సమరాంగణాన్నే కోరుకుంటాడు
అందుకే మానవ చరిత్ర అంతా యుద్ధమయం
యుద్ధాలులేని చరిత్ర చదివితే అర్ధవిహీనం
స్వార్ధం ఒక ప్రాధమిక శక్తి
క్రౌర్యంమీద అభిరక్తి
అజ్ఞాతంగా మనిషిలో పశువులో సమానం
వైజ్ఞానికులు చెబుతారు దీనిలో నిజం
ఆశయాలూ ఆదర్శాలూ అంగవస్త్రాల లాంటివి
హఠాత్ పవన వీచికకి అటే తొలగిపోతవి
అసలైన మనిషి కాస్త అలజడిలో బయటపడతాడు
కసటు కనబడాలంటే పైన కొంచెం కదిలించి చూడాలి
అక్కడక్కడ మహాత్ముని అడుగుజాడ కనపడినా
అటువైపు మళ్ళాక అడ్డదారినే గుడ్డిగా పడిపోతాడు
అవివేకానికున్న బలం ఆవేశాని కతికినప్పుడు
ద్విపాదవాహనాలు బద్దెలు తప్పి ప్రమాదించక తప్పదు
అందుకే మానవుడు మానవుడిగా దేవుడిగా రూపొందే ఈ ప్రయాణం
అనంతదీర్ఘం పునఃపునర్వ్యర్ధం బహుయుగ విస్తీర్ణం
* * *
---1963



