Home » Dr S V S Kishore Kumar » First Crush


 

అవును. మీరు బిజీ బిజీ గా ఉంటారు. ఇక నన్నెక్కడ గమనిస్తారు. కానీ నేను మీ ప్రతి కదలిక గమనిస్తూ ఉంటాను వినీల్ గారు అంది చిలిపిగా.
ఓహ్ పేరు కూడా తెలుసన్న మాట.
మరీ. మీరే నా ఫస్ట్ క్రష్ కదా అంది.
ఏంటీ అంటూ సడన్ బ్రేక్ వేసాడు. లక్కీ గా వెనుక వాహనాలు లేవు. లేకుంటే చిన్న ఆక్సిడెంట్ అయ్యుండేది. 
మెల్లగా బాస్. ఎందుకంత తత్తరపాటు.
నేను భీమవరం లో మీరు చదివిన గవర్నమెంట్ స్కూల్ లోనే తొమ్మిదవ క్లాస్ లో చేరాను. అప్పుడు మీరు పదవ తరగతి. మీరు స్కూల్ టాపర్ కదా అన్ని క్లాసుల్లో. స్టూడెంట్స్ కి టీచర్స్ కి మీరంటే వల్లమాలిన ప్రేమ, అభిమానం. మీలాంటి వారి వల్లే గవర్నమెంట్ స్కూల్ కు అప్పట్లో అంత పేరు వచ్చింది. టీచర్స్ కూడా మీకు తగ్గట్టే కష్టపడి అందరిని శ్రద్ధగా చదివించేవారు. అందుకే మీ గవర్నమెంట్ స్కూల్ తో పోటీ పడలేక కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మూతబడ్డాయి భీమవరంలో. తల్లితండ్రుల కన్ను బాగా చదివిస్తున్న గవర్నమెంట్ స్కూల్ పై పడింది. తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ లో చేర్చేందుకు పోటీపడ్డారు. ఆ సంవత్సరం మంచి రాంకులు కూడా గవర్నమెంట్ స్కూల్ కే వచ్చాయి. 
నేను ఎనిమిది వరకు ఓ పేరు మోసిన కాన్వెంట్ స్కూల్ లో చదివాను. కానీ అక్కడ స్టడీస్ కి అంతగా ప్రాముఖ్యత లేదు. ఇది గమనించి నాన్నగారు నన్ను తొమ్మిదవ తరగతి లో  గవర్నమెంట్ స్కూల్ లో చేర్చారు.


****


మీ స్కూల్ లో చేరిన మొదటి రోజే క్విజ్ కాంపిటీషన్స్ జరిగాయి.
తొమ్మిది, పదవ తరగతులు కంబైన్డ్ చేసి టీంలు చేశారు.
మా టీం కి మీరే లీడర్.
మీరు మాకెవ్వరికి ఛాన్స్ ఇవ్వకుండా టక టక అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పి టీంని ఒంటి చేత్తో గెలిపించారు.
అదిగో అప్పటినుంచి మీరు నా మనసులో చేరిపోయారు అంది.
ఓహ్ ఇంత చరిత్ర ఉందా ! నాకు అస్సలు తెలియదు సుమా అన్నాడు ఆశ్చర్యపోతూ.
ఎందుకు తెలుస్తుంది. మీరు పుస్తకాల పురుగు కదా. పక్కవారిని అస్సలు పట్టించుకుంటే కదా. ఎప్పుడూ  చదువు బిడ్డే అయిపాయె. కాకుంటే మీ స్ఫూర్తి తోనే నేను కూడా మీ అడుగు జాడల్లో నడిచి ఎం సెట్ లో పదవ రాంక్ సంపాదించాను. అదే నాకు మెడిసిన్లో చేరేందుకు చాలా ఉపయోగపడింది. అందుకు మీకు చాలా రుణపడి ఉన్నాను. నిజంగా ప్రామిస్ అంది వినీల్ వైపే చూస్తూ.
అంతే కాదు మనం చదువుకునేప్పుడు మీకు ప్రతి బుధవారం ఒక లాలీపాప్ మీరు కూర్చునే టేబుల్ డ్రా లో పెట్టేదాన్ని తెలుసా.
అరే ! అవును. నేను అది చూసి చాలా ఆశ్చర్య పోతుండేవాడిని అన్నాడు అంతే ఆశ్చర్యంతో.
మరి ఆ లాలీపాప్ ఎవరుపెడుతున్నారో కనుక్కోలేకపోయారు. అవునా ! ఎందుకంటే అబ్బాయిగారికి ఎంతసేపూ చదువు చదువు. ఇంకే వేరే ధ్యాస లేదుగా అందుకని.
నిజమే ఆ రోజుల్లో చదువంటే ఒక పిచ్చిగా ఉండేది. ప్రక్కన ఏమి జరుగుతున్నా పట్టించుకునేవాణ్ణి కాదు. 
ఇప్పుడూ అంతే. మీరేం మారలేదు. అమ్మాయి ప్రక్కనున్నా పట్టించుకోరు.
అవును. ఇప్పటి నా పరిస్థితికి  కారణం మా నాన్నగారికి జాతకాల మీద బాగా నమ్మకం ఎక్కువ. జాతకాలు కుదిరితేకాని నాకు పెళ్లి జరుగదు. నేను మా నాన్నగారిని గౌరవిస్తాను. అందుకే ఆయన తెచ్చిన సంబంధం చేసుకుంటాను. అప్పటివరకు ఇలానే ఉంటాను అన్నాడు.
సరే అయితే. నా జాతకం కూడా ఇస్తాను మీకు. మీ నాన్నగారికి పంపండి. నేనుకూడా మీ స్వయంవరం క్యూలో ఉంటాను. ఇప్పటి వరకు మిమ్మల్ని ఫాలో అయ్యి అయ్యి అలసిపోయాను. ఇక నా వల్ల కాదు.  
సరే ఇవ్వు. వాట్సాప్లో పంపించు. మా నాన్నగారికి పంపిస్తాను అన్నాడు. 
అది సరే ముందిది చెప్పు. నేను గలగలా అన్ని విషయాలు మాట్లాడేసాను. మరి నేనంటే మీకు ఇష్టమేనా అంది అతని మొహంలోకి చూస్తూ. 
ఆమె శరీర పరిమళం, అందం వినీల్ ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అతనికి తట్టుకోవడం కష్టంగా ఉంది. మునుపెన్నడూ ఇలా అమ్మాయిలు ముందు సీట్లో తన పక్కన కూర్చున్న పరిస్థితి లేదు. ఇప్పుడు విజిత తన పక్కనే కూర్చుని వసపిట్టలా కబుర్లు చెపుతూ, కవ్విస్తూ, తనంటే ఇష్టపడుతూ, తన మొహంలోకి ఆరాధనగా చూస్తూ, తనే లోకమని భావిస్తూ అల్లరి చేస్తుంటే మనసు దూది పింజలా ఊహల ఊయలలూగుతోంది. కానీ ఒక వైపు నాన్నే కనిపిస్తున్నాడు. మనసు నాన్న వైపే మొగ్గుతోంది. 
విజిత అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ నువ్వంటే ఇష్టం కాదు అని ఆగాడు వినీల్.
ఓహ్ అయితే ఓకే లే అంది విజిత బాధపడుతూ.
ప్రాణం అన్నాడు. నీలాంటి అమ్మాయిని ఇష్టపడని వాడు భూప్రపంచంలో ఎవరుంటారు చెప్పు. కానీ నేను మా నాన్నను నొప్పించలేను అన్నాడు. అది నువ్వు గ్రహించాలి. కొంచెం జీరగా ఉంది అతని స్వరం.
ఇట్స్ ఓకే వినీల్. రాసి పెట్టుంటే జరుగుతుంది. లీవ్ ఇట్ టు ఫేట్. మన చేతుల్లో ఏదీ లేదు కదా అంది చిరు మందహాసం చేస్తూ. 
ముమ్మాటికీ నిజమే అన్నాడు. మరి మీ అభిప్రాయానికి మీ ఇంట్లో ఒప్పుకుంటారా అని అనుమానంగా అడిగాడు. ఈ చదువుల బిడ్డను ధనికుల బిడ్డ చేసుకుంటుందా !
నేను మా అమ్మ నాన్నలకు ఒక్కతే సంతానం. మా నాన్న గారు కూడా మా అమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ బ్రాహ్మిన్స్. వారికి ప్రేమ విలువ తెలుసు. నా మాట బహుశా కాదనరు అంది విజిత. 
ఇద్దరి నడుమ కొంచెం నిశ్శబ్దం నడిచింది.
ఇంతలో ఇల్లు రానే వచ్చింది.
విజి నివాస్ ముందు కారు ఆపాడు. ఆమె కారు దిగుతుంటే ఆ తీయటి పరిమళం అతన్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కరి చేసింది. 
డోర్ వెయ్యబోతూ గుడ్ నైట్ అంది ప్రేమగా. 
ఆమె వైపు చూస్తూ గుడ్ నైట్ అన్నాడు.


****


ఇంటి డోర్ తీసి లోపలికి వెళుతూ ఎప్పుడూ బాల్కనీ లో అడుగుపెట్టని వినీల్ జస్ట్ బాల్కనీలోకి వెళ్ళాడు. ప్రక్కింటి వైపు చూసాడు.
లోపలికి వెళ్ళబోతూ విజిత చూసిన చూపులకు అతని చూపులు చిక్కడ్డాయి. అవి కాసేపు చిక్కు రాక అలానే ఉండి పోయి మెల్లగా విడివడ్డాయి.
విజిత మందహాసానికి అతని మనసులో ఒక్కసారిగా ప్రేమ తరంగాలు ఉవ్వెత్తున లేచి ఆకాశాన్నంటాయి.
ఆమ్మో అనుకుంటూ లోపలకి వెళ్ళాడు.
తనలో తను నవ్వుకుంటూ విజిత ఇంట్లోకి దారితీసింది. 
అవునూ విజిత తన జాతకం డీటెయిల్స్ ఇస్తాను అంది. మరి తనకు నా ఫోన్ నెంబర్ తెలియదుగా ఎలా ఇస్తుంది అని ఆశ్చర్యపోతున్న సమయంలో ఫోన్ లో మెసేజ్ టింగు మంది.
వాట్సాప్ లో కొత్త నెంబర్. ఓపెన్ చేస్తే హాయ్ నేను విజి ని . నా జాతకం అటాచ్ చేస్తున్నా. మీ నాన్నగారికి పంపండి. బై అని ఉంది.
డీపీ లో తన ఫోటో ఏమీ లేదు. బ్లాంక్ గా ఉంది.
ఓహ్ అయితే నా నెంబర్ తన దగ్గర ఉందన్న మాట. నాపై డ్రోన్ కెమెరా సెట్ చేసినట్లుంది తాను అని నవ్వుకున్నాడు. 
రాత్రి ఫ్రూప్ట్స్ తిని పడుకోవడం వినీల్ కి అలవాటు. అవి తినడం పూర్తయ్యాక విజిత జాతకం తండ్రికి వాట్సాప్ లో ఫార్వర్డ్ చేసి నిద్రకు ఉపక్రమించాడు.
ప్రొద్దున్నే ఆఫీసర్స్ క్లబ్ లో టెన్నిస్ ఆడుతుంటాడు వినీల్. అది అతని దైనందిక చర్యలో మొదటి ఐటెం. 
ఐదు గంటలకు లేచి ఫ్రెష్ అప్ అయ్యే బయటికి వచ్చాడు కారు తీసి బయలుదేరుదామని.
ఎందుకో అనుమానం వచ్చి పక్కింటి వైపు చూసాడు .
గుమ్మం సిట్ అవుట్ లో విజిత నిల్చుని వుంది. నవ్వుతూ చెయ్యి ఊపింది.
ప్రతిగా వినీల్ కూడా చెయ్యూపాడు.
అంటే తన కదలికలు గమనిస్తోందన్నమాట.
ఎందుకో తమ జాతకాలు కుదిరితే బాగుణ్ణు అనిపించింది వినీల్ కి. నాన్నగారు ఏమంటారో అనుకుని టెన్నిస్ క్లబ్ కి బయలుదేరాడు. 
టెన్నిస్ ఆడటం పూర్తయి జ్యూస్ తాగేప్పుడు బాస్ నుంచి ఫోన్.

 




Related Novels


Midunam

Prema Pelli Vidakulu

Nari Nari Naduma Murari

First Crush

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.