Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
విద్యుదావేశ తంత్రులు తగిలి రగిలి
నీ పాత తాటియాకుల ఇల్లు
తగులబడి బూడిద మిగిలి
నిలువ నీడలేని నిన్నూ నాకు తెలుసు
నీ మీదకే గురిపెట్టబడింది విధి దనుస్సు.
కాదు ఇది నీ దేవీ పూజాపీఠ
మమర్చిన శుభ గృహాంగణము
పెద్దపులులు కొండచిలువ లెలుగులు
తిరుగు మహారణ్యము
ఒంటరిగాడవని నాకు తెలుసు
అందుకే వీళ్ళకింత అలుసు
స్వార్ధం ద్వేషం క్రౌర్యం వినా జీవితం లేదసలు
నాగరికత బండరాతి కొన తగిలి
చిల్లుపడింది నీ నొసలు
గాయం మానదని నాకు తెలుసు
గేయం ఇక ఎవ్వరూ వినరని నాకు తెలుసు.
ఇంతవరకు సత్య శాంతి సౌందర్య
సంగీత గీత మాలపించావని
ఇపుడింక వ్యథా చిహ్నితమైన
నీ కనుల కింద నలుపు చార చెరగదని
నీలాంటివాణ్ణి నాకు తెలుసు
నిద్రలోనే కలలకి సొగసు
* * * ---1954
త్రిశూలం
నమ్మకు నవ్వలేనివాడిని, పువ్వులు చిదిమేవాడిని
బరిమీద వదలిన పాముని, చైనావాడిని.
నమ్మకు హంతకుని ఈటెని, గోతులున్న బాటని
బోగందాని పాటని, చౌఎన్ లై మాటని.
నమ్మకు మొసళ్ళున్న సరస్సుని, మూర్ఖుఢధ్యక్షించిన సదస్సుని
సినీతార వయస్సుని, మావ్సెటుంగ్ మనస్సుని...
సరిహద్దు మాత్రమే అయితే
సరిపెట్టుకోవచ్చు నొకలాగ
చిరకాలం కృషిచేసే మానవుడు
స్థిరంగా నిలుపుకున్న విలువల్ని
చెరపివేస్తానంటే ఊరుకునేదెలాగ?
దేశానికి హద్దులూ ప్రవర్తనకి ఎల్లలూ
ఆవేశాలకు మితీ, కావేశాలకి పరిమితీ
అవసరం మానవ సౌఖ్యానికీ సఖ్యానికీ.



