Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
కాలానికి ఒక రూపం లేదు దానికి పాపం లేదు
కాలం అద్దం లాంటిది
అంధయుగమైనా స్వర్ణయుగమైనా అది మన ప్రతిబింబం
కాలం వలయం లాంటిది దానికి కేంద్రం లేదు
ఎవడికివాడే యిచ్ఛా ప్రయత్నబలంతో
వర్ణోజ్వల వలయాలను సృష్టించగలుగుతాడు
కాలం జాలం లాంటిది
కళ్ళు మూసుకుని నడిస్తే ఉచ్చులో పడతాడు
శక్తిపరుడు యుక్తిపరుడు దాన్ని ఛేదిస్తాడు.
కాలం సవాల్ వంటిది
సాహసవంతు డందుకొని ముందు సాగిపోతాడు
చప్పబడిన పెద్దన్నయ్య చతికిలబడిపోతాడు
ఆహార సమస్య అణ్వస్త్ర విపత్తయినా
ఆకలి రోగం రణం వ్రణం ఏదయినా
ఈ ధాత్రీ వదనాన్ని వికృతం చేసే, ఈ మనుగడని భారం చేసే
దుస్సహ పరిస్థితి అనారోగ్య మనస్థితి అసంతృప్తి అవాప్తి
అవివేకులు స్వార్ధపరులు కలిగించిన ఫలితం
తమని తాము బంధించుకున్న సూత్రాలలోంచి నమ్మకాలలోంచి
తప్పించుకోలేని మనుషుల నిస్సహాయ జనితం
కొత్తదారి తొక్కలేని కొత్తమలుపు తిరగలేని
కుంటి గ్రుడ్డివాళ్ళ ప్రయాణ కోలాహలం
మురికి కాల్వమీద ముసలితనంమీద మృషాజగతిమీద
మహోదయం వికసించదు, వసంతం హసించదు
గదిలో కూర్చుని వసంతం వసంతం అని తన
మదిలో మలిన శృంగార తృప్తి పొందేవాడు వికారుడు శకారుడు
సంప్రదాయ భీరువుకీ అస్వతంత్ర వితంతువుకీ వసంతం లేదు
సాహసి కానివాడు జీవన సమరానికి స్వర్గానికి పనికిరాడు
హిమసుందర శృంగమైన ఎవరెస్టుని ఒక టెన్సింగే ఎక్కగలడు
సుమనసుందర వసంత గీతంలో ఉగాది నాహ్వానించగలడు.
* * *
---1966
భరతవాక్యం
సుందర స్వప్నాల స్వర్గాల మేడమెట్ల నుండి
వాస్తవికతా శిథిల బధిర రుధిర కూపానికి
హఠాత్ పతితుడైన నాకు తెలుసు
అల్పమని నీవు అల్లిన గొలుసు.
మానవుడై నీవు చాచిన ప్రేమైక హస్తాన్ని
దానవుడై వాడు నరికిన చరిత్ర సమస్తాన్ని
పొంచి చూచిన నాకు తెలుసు
వంచిత మని మానవ మనస్సు.
నీ నిరంతర తపస్సు ప్రసరించిన



