Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
మనస్సెపుడో మొద్దుబారి మనుగడ పడికట్ల మరమేకుల్లో దిగబడి
మూల్గిమూల్గి మూల్గునే సంగీతం అని మురిసిపోతోంది
ఎవరూ చూడడంలేదు క్షితిజరేఖ వెనుక నిలిచి పిలిచే రత్నకంకణ
హస్తాన్ని
ఎవరూ వినడంలేదు నిద్రకీ మెలుకువకీ మధ్య ఒక క్షణం మ్రోగిన
జంత్ర సంగీతాన్ని
అపుడు నేను కాలతీరాన ఒకణ్ణి నడుస్తున్నాను
చరిత్ర విచిత్ర సముద్రాలవలోకిస్తూ
అవి విరిసిన తుంపరల్లో తడుస్తూ
అవును నామీదికి భవిష్యద్గగనం వంగి, నా
చెవిలో చెప్పిన రహస్యం విన్నాను
చెదిరిన మబ్బుల మధ్య సూర్యుణ్ణి చూశాను
అపుడు నేను ఈజిప్టు పిరమిడ్ల మధ్య బాబిలోనియా స్థూపాలమధ్య
మొహంజొదారో శిథిలాల మధ్య నిలిచి కలలు కన్నాను
అలా అలా అనాది అనాది అంధకార భయంకారాటవుల మధ్య
సృష్టి సింహం చేసిన ప్రధమగర్జన విన్నాను
పెనుతుఫానులో సముద్రాల ఉప్పెనలో ఊగి ఊగి లుంగలు చుట్టుకు
పోతున్న
భూమి పేగుల్ని చూశాను
ఎగుడుదిగుళ్ళ దారిలొ సుద్దకొండలు అగ్నిపర్వతాలు ఎడారులచుట్టూ
గిజగిజలాడుతూ పెనుగుతూన్న ప్రాణహరితాన్ని చూస్తున్నా
పచ్చబడిన భూమిమీద ఫక్కున నవ్విన సూర్యుడి సంతోషపు వెలుతురు
విచ్చిన ప్రాణం చుట్టూ ఉబికిన వెచ్చని ఎర్రని నెత్తురు
నిలదొక్కుకున్న ఆదిమానవుడు నిలిచి పూరించిన శంఖం
ఇది సంగ్రామానికి సూచన
ఇది ప్రస్థానోపక్రమణిక
సీజర్ కౌక్షేయధార మెరిసింది
అలెగ్జాండర్ అశ్వరింఖా ఘట్టన మొరిసింది
రాజ్యం రమణినీ మించిన రమ్యభావన విరసింది
షేక్స్ పియర్ డాంటే కాళిదాసూ శంకరుడూ
మార్క్సూ మహాత్ముడూ పికాసో సార్ట్రే
ఎవరైనా ఇది నిరంతర నూతన పరిశోధన
సత్యసౌందర్యాన్వేషణ ఒక శిఖరారోహణ
***



