Home » Devarakonda Balagangadhara Tilak » అమృతం కురిసిన రాత్రి
శిఖరారోహణ
లైట్లు వెలిగిన స్టేషన్ లోకి రైలు వచ్చినట్టుగా
కొత్త సంవత్సరం హుషారుగా కొత్తగా రావాలి మన మధ్యకి
కాని యీసారి ఫ్లాట్ పారమంతా చీకటిగా వుంది
పాత మాటల మూటలతో కవులూ
వట్టిమాటల సంచులతో రాజకీయవేత్తలూ
మొహమాటం లేకుండా ముందెక్కి కూర్చున్నారు
రైలింగ్ అవతల టిక్కెట్లు దొరక్క ప్రజలు దిగాలుపడి నుంచున్నారు
రేపటి ఉదయానికి వేసిన పట్టాల్ని ఎవరో తొలగించి వేశారు.
* * *
ఇక్షుకోదండ జ్యావల్లి నాస్ఫాలించబోయి
చటుక్కున ఎందుకో మన్మధుడు వెనక్కి అడుగువేశాడు
ఆమ్రశాఖాగ్ర పుంస్కోకిల సమ్మె ప్రకటించింది
పల్లవం ముట్టదు గొంతుక విప్పదు
అన్యోన్యానురక్తులైన యువతీ యువకు లొక్కసారిగ
హూలాహుప్ ట్విస్ట్ లా వేసి అసమ్మతి ప్రకటించరు
వాసంత సమీరం వస్తూ వస్తూ
ఊరి శివారున తుమ్మల తోపుల్లో స్తంభించిపోయింది
మాధవ దేవునికి మర్యాద లెవరు చేస్తారు
సాహస చందనం ఎవరు పూస్తారు
సౌందర్య నేపధ్య మెవరు కై సేస్తారు
జీవనవనంలో నవనవ సురభిళరమ్యం యౌవనసుమం ఎవరు పూయిస్తారు?
* * *
గుమ్మం తగిలి తలమీద బొప్పికట్టినా గొప్పకి నవ్విన
కొత్తకోడలులా వచ్చి నిలుచుంది కొత్త సంవత్సరం
బెదురుగా దిగులుగా ఎబ్బెట్టుగా నిలుచుంది కొత్త సంవత్సరం
జడుసుకున్న పిరికివాడు మగడు
జాలిలేని గయ్యాళి అత్త
తన పూర్వపు హోదాని నెమరేస్తూ బతికే మామగారు
ఇంటి చూరుపట్టుకు వేలాడే ప్రేతాత్మలు గబ్బిలాలు
ఇంటివెనుక పాడుబావిలో మొలిచిన పిచ్చి మొక్కలు
ఇదే సమయం అని వీధిలో నిలిచి కన్నుగీటే మొనగాళ్ళు
ఇదీ కథ ఎలా రక్తి కట్టిస్తావు రసం పుట్టిస్తావు
ఈ వడగాలిలో హోరులో ఏ రాగం వినిపిస్తావు...
* * *



